పోలీసు పెట్రోలింగ్‌ కారు ఢీకొని.. జీహెచ్‌ఎంసీ కార్మికురాలి దుర్మరణం

17 Aug, 2018 09:25 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన పెట్రోలింగ్‌ వాహనం, సాయమ్మ (ఫైల్‌)

యాకుత్‌పురా బ్రాహ్మణవాడిలో ఘటన

యాకుత్‌పురా: పోలీస్‌ పెట్రోలింగ్‌ కారు ఢీ కొని విధి నిర్వహణలో ఉన్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన గురువారం రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ జావీద్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింగరేణి కాలనీకి చెందిన సాయమ్మ (56) గత 25 ఏళ్లుగా జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ప్రస్తుతం చార్మినార్‌ జోన్‌ సర్కిల్‌–7 రెయిన్‌బజార్‌ డివిజన్, యాకుత్‌పురా బడాబజార్‌లో విధులు నిర్వహిస్తుంది.

గురువారం ఉదయం ఆమె బడాబజార్‌ బ్రాహ్మణ్‌వాడీ వైపు వెళ్లే రోడ్డును శుభ్ర పరుస్తుండగా... రెయిన్‌బజార్‌ పీఎస్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌  నిర్లక్ష్యంగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనాన్ని  నడుపుతూ సాయమ్మను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తోటి కార్మికులు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్, సర్కిల్‌–7 డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ కుమార్, ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ జి. విజయ్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుమార్తె  యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెయిన్‌బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

డ్రైవర్‌ అందుబాటులో లేనందునే...  
రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు రాజు గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు.  అదే సమయంలో మౌలాకా చిల్లా నుంచి ఫోన్‌లో ఫిర్యాదు అందడంతో అశోక్‌ వాహనం తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని ఇన్‌స్పెక్టర్‌  తెలిపారు. కాగా ప్రమాదానికి కారకుడైన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ను సస్పెండ్‌ చేస్తూ, రెయిన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌కు చార్జ్‌ మెమో జారీ చేస్తూ నగరపోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రూ.2 లక్షల నష్టపరిహారం...
మృతురాలు సాయమ్మ కుటుంబ సభ్యులకు ఉద్యోగం, మేయర్‌ నిధుల నుంచి రూ.2 లక్షల నష్ట పరిహారం చెల్లించనున్నట్లు   జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–7 డిప్యూటీ కమిషనర్‌ పి.రవీందర్‌ కుమార్, ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ జి. విజయ్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు