దెబ్బకు ‘దెయ్యం’ వదిలింది..

12 Nov, 2019 16:20 IST|Sakshi

బెంగళూరు: దెయ్యాల్లాగా వేషాలు వేసుకుని ప్రాంక్‌ వీడియో చేసిన యువకులకు దెబ్బకు దేవుడు గుర్తొచ్చిన ఘటన బెంగళూరులో జరిగింది. పక్కవాళ్లను భయపెట్టి పాపులారిటీ సంపాదించుకుందాం అనుకున్నవాళ్లు చివరకు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కి వార్తల్లో నిలిచారు. వివరాలు.. కుకీ పీడియా అనే యూట్యూబ్‌ చానెల్‌ నిర్వాహకులు ఓ ప్రాంక్‌ వీడియో చేద్దామని భావించారు. ఇందుకోసం షరీఫ్‌నగర్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రాంక్‌ వీడియో కోసం.. ఏడుగురు.. దెయ్యాల్లా వేషాలు వేసుకుని సోమవారం అర్థరాత్రి రోడ్లమీదకు వచ్చారు. వీరిని చూసిన ప్రయాణికుల్లో కొంతమంది భయంతో జడుసుకున్నారు. అయితే దెయ్యాల ముసుగులో ఉన్నది మనుషులేనన్న విషయం తెలుసుకున్నాక అక్కడి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రాంక్‌ వీడియోల పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తులు శాన్‌ మాలిక్‌, నవీద్‌, మహమ్మద్‌ సాజిల్‌, సకీబ్‌, సైద్‌ నబిల్‌, యుసిఫ్‌ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులుగా పేర్కొన్నారు. జనాల్లో ఫేమస్‌ కావడానికి ఇలాంటి పనులు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే వారు క్షమాపణలు కోరినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోక తప్పలేదు. టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో 144 సెక్షన్‌ అమలులో ఉంది. ప్రాంక్‌ పేరిట ప్రజలను ఇబ్బందులకు గరిచేయడంతో పాటు, ఒకేసారి ఇంత మంది కలిసి రోడ్లపై హల్‌చల్‌ చేయడంతో వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ యువకుల కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు వారిని బెయిల్‌పై వదిలేశారు. 

మరిన్ని వార్తలు