మృగాళ్ల పైశాచికత్వం: చిన్నారిని హింసించి..

2 Dec, 2019 10:40 IST|Sakshi

జైపూర్‌ : దేశ వ్యాప్తంగా మానవమృగాలు రెచ్చిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు పిచ్చికుక్కల్లా వెంటపడుతూ అకృత్యాలకు ఒడిగడుతున్నాయి. దేశమంతా దిశా పాశవిక హత్య గురించి నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ రాజస్తాన్‌లో ఓ చిన్నారి అత్యంత దారుణ పరిస్థితుల్లో శవమై తేలింది. చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అంతమొందించారు. వివరాలు.. టోంక్‌ జిల్లా ఖేతడి గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో శనివారం స్కూళ్లో ఆటలపోటీలు ఉండటంతో తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపింది. అయితే మధ్యాహ్నం మూడు గంటలు దాటినా సదరు చిన్నారి ఇంటికి రాకపోవడంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమె కోసం స్కూల్‌ సహా బంధువుల ఇళ్లల్లో వెదికారు. అయినప్పటికీ చిన్నారి జాడ తెలియరాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం చిన్నారి తన గ్రామానికి సమీపంలో పొదల్లో శవమై కనిపించింది. యూనిఫాం మొత్తం రక్తపు మరకలతో నిండి ఉండగా.. స్కూలు బెల్టు మెడకు చుట్టి ఉంది. ఘటనాస్థలంలో మందు బాటిళ్లు, స్నాక్స్‌ కూడా లభించడంతో మద్యం మత్తులోనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నారిపై అత్యాచారం చేసిన అనంతరం... దుండగులు బెల్టుతో తన మెడకు ఉరి బిగించి హత్య చేశారని తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని.. త్వరితగతిన కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు. ఇక చిన్నారి అత్యాచారం, హత్య గురించి తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితులను తొందరగా అరెస్టు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా