బాలిక బలవన్మరణం

2 Jun, 2020 07:55 IST|Sakshi
నవనీత (ఫైల్‌)

మూడు నెలల క్రితం ప్రేమ వివాహం

భర్త వేధింపులతో ఆత్మహత్య

ఘటనపై బాలల హక్కుల సంఘం విచారం

రంగారెడ్డి, దోమ: భర్త వేధింపులు తాళలేక ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమ మండల పరిధిలోని గుండాల్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల్‌ గ్రామానికి చెందిన గుడిసె నర్సింహులు, లక్ష్మి దంపతుల కూమార్తె నవనీత(17)ను అదే గ్రామానికి చెందిన జన్మండ్ల హన్మంతురెడ్డి కుమారుడు శివకుమార్‌రెడ్డి మూడు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరిరువురు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. ఈ క్రమంలో తనను భర్త తరచు వేధింపులకు గురిచేస్తున్నాడని నవనీత తల్లికి పలుమార్లు తెలిపింది. నెల రోజుల క్రితం శివకుమార్‌రెడ్డి నవనీతను తల్లిగారి ఇంట్లో వదిలేసి వెళ్లగా ఆదివారం రాత్రి ఆమె తల్లిగారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు వచ్చి చూసేసరికి ఆమె మృతిచెందింది. వెంటనే పోలీసులు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.(తల్లితో గొడవపడి... మూడురోజులకు బావిలో)

బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం.
బాలిక ఆత్మహత్య చేసుకోవడంపై బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తుందని బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు. మైనర్లు ఇలాంటి చర్యలకు పాల్పడడం కేవలం సినిమా, టీవీ సీరియల్స్‌ ప్రభావమని, మైనర్ల వివాహం చెల్లదని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారాలు జరపాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు