అంతులేని విషాదం

24 Dec, 2019 13:20 IST|Sakshi
కాలి మరణించిన బాలికల మృతదేహాల వద్ద విలపిస్తుçన్న బంధువులు

ఇద్దరు బాలికల సజీవ దహనం

శోకసంద్రంలో బాధిత కుటుంబం, గ్రామస్తులు

మేలిమి బంగారు తల్లులు..కలువ కన్నుల పిల్లలు..తల్లులు కన్న బాలికలు..చెంగు చెంగున గెంతుతూ కల్లాకపటం లేకుండా మనసారా నవ్వే చిన్నారులు..ఆడుతూ పాడుతూ గంతులేస్తున్న ఇద్దరు బాలికలు సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన బాలికల కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలో ముంచేయగా నవరంగపూర్‌ జిల్లా వాసులను కలిచివేసింది.                                           

ఒడిశా, జయపురం :అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అకస్మాత్తుగా తనువు చాలించడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నవరంగపూర్‌ జిల్లా ఝోరిగాం సమితి మైనాపొదర్‌  గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు మొక్కజొన్న కుప్పల మంటలలో  సజీవదహనమయ్యారు. గ్రామానికి చెందిన సామసన్‌ శాంత,   పవిత్ర శాంత అన్నదమ్ములు. అన్నదమ్ములు పండించిన మొక్కజొన్న పంటను కోసి కళ్లంలో కుప్పలు వేశారు. అలాగే మొక్కజొన్న గడ్డిని కూడా కళ్లంలో పోగుగా పెట్టారు. ఆదివారం సాయంత్రం సామ్‌సన్‌ శాంత కుమార్తె సుజాత శాంత(4) పవిత్ర శాంత కుమార్తెలు అలీనా శాత(4) అర్చిత శాంత(2)లు ఆ కళ్లంలో ఆడుకుంటున్నారు. అయితే అకస్మాత్తుగా మొక్కజొన్న గడ్డి కుప్పలకు అగ్ని అంటుకుని నలువైపులా వ్యాపించింది. ఆడుకుంటున్న పిల్లలు అక్కడే ఉన్న పూరిపాకలోకి వెళ్లారు.

మంటలు ఆ పాకకు కూడా వ్యాపించగా రెండేళ్ల అర్చిత ఎలాగో తప్పించుకుని అదృష్టవశాత్తు  బయటపడింది. అయితే సుజాత, అలీనాలు మంటల్లోనుంచి బయట పడలేక పోయారు. వారి చుట్టూ మంటలు వ్యాపించడంతో హాహాకారాలు చేస్తూ కాలి బూడిదయ్యారు. మొక్కజొన్న కుప్పలకు అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగిసి పడడం గమనించిన గ్రామస్తులు అక్కడికి వచ్చి చూసి ఇద్దరు బిడ్డలు  మంటల్లో కాలిపోయి ఉంటారని అనుమానించి మంటలను ఆర్పి చూడగా కాలి బూడిదైన సుజాత, అలీనాలు కనిపించారు. ఈ విషయం వెంటనే పోలీసులు, అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. అయితే ఆ గ్రామం మారుమూల దుర్గమ ప్రాంతంలో ఉండడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రాలేకపోయారు. వారు చాలా ఆలస్యంగా వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఆ కుటుంబాలనే కాకుండా గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆ కళ్లంలో ఉండేందుకు అన్నదమ్ములు పాక వేసుకున్నారని అక్కడనే కుటుంబాలతో ఉంటూ వంటలు కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం వంట పొయ్యిలోని నిప్పులు రాజుకుని ఎగిరి పడడం వల్ల సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు