చితికిన చిన్నారి జీవితం

5 Feb, 2019 13:13 IST|Sakshi
మృతిచెందిన కుమార్తెను చూసి సొమ్మసిల్లిపడిపోయిన తల్లి

స్కూల్‌వ్యాన్‌ కిందపడి     చిన్నారి మృతి

డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం

ఆ దంపతులకు ఇద్దరూ ఆడపిల్లలే. వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలుగా పనిచేసే ఆ దంపతులు తమ పిల్లలకు ఏ కష్టం రాకూడదని మంచి చదువులు చదివించాలని భావించారు. దీంతో ఉన్న ఊరిలో కాదని పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. పాఠశాల స్కూల్‌ బస్సు డ్రైవర్‌ అజాగ్రత్త ఆ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లుచల్లింది. పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన హృదయ విదారక ఘటన మండల పరిధిలోని నారాయణరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..

వైఎస్‌ఆర్‌ జిల్లా, అట్లూరు : మండల పరిధిలోని నారాయణరాజుపేటకు చెందిన చింతంరెడ్డినాగేశ్వర్‌రెడ్డి, వసుధదేవిలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమార్తె అయిన చింతంరెడ్డినాగలక్ష్మి (5) బద్వేలు పట్టణంలోని మహేశ్వర్‌రెడ్డి హైస్కూల్‌లో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజు గ్రామానికి వచ్చే ఏపీ04ఎక్స్‌3336 నంబరు గల స్కూల్‌ బస్సులో పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండేది. రోజూ మాదిరే సోమవారం పాఠశాలకు వెళ్లిన నాగలక్ష్మి సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకుని బస్సు దిగింది. ఈ సమయంలో చిన్నారి బస్సు పక్కనే ఉండగా బస్సుడ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతూ అజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో చిన్నారి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది.

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ బస్సు కింద పడి మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న నాగలక్ష్మి తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి పరుగులు తీసి కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం ఇంట్లో సందడిగా గడిపిన తమ చిన్నారి ఇక రాదని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ‘‘దేవుడా, మాకెందుకు ఇంత అన్యాయం చేశావంటూ’’రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, బస్సును స్టేషన్‌కు తరలించారు. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా బస్సుడ్రైవర్‌ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మిగతా గ్రామాలకు వెళ్లాల్సిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని తమ పిల్లలను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు