శోకాన్ని మిగిల్చిన శ్రావణి

18 Apr, 2019 13:06 IST|Sakshi
మృతి చెందిన శ్రావణి (ఫైల్‌)

సాంబారు గిన్నెలో పడిన చిన్నారి మృతి

ఆ దంపతులకు పెళ్లయిన ఏడేళ్లకు జన్మించింది ఆ చిన్నారి. అందుకే ఆ పాపంటే వాళ్లకు ప్రాణం. బుడిబుడినడకలతో ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తుంటే  ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడేవారు. ఇంతలో విధి వక్రించింది. సాంబారు గిన్నెలో పడి ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. కన్నతల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.  

తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): ప్రమాదవశాత్తూ సాంబారు గిన్నెలో పడిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రాయవరం ఎస్సై కొండపల్లి సురేష్‌బాబు బుధవారం  తెలిపారు. మండలంలోని వెదురుపాక శెట్టిబలిజ రామాలయం వద్ద ఈ నెల 14న శ్రీరామ నవమిని పురస్కరించుకుని అన్నసమారాధన నిర్వహించారు. గ్రామానికి చెందిన వాసంశెట్టి శ్రావణి అనే ఏడేళ్ల బాలిక వంటలు చేస్తున్న ప్రాంతంలో నిప్పులను గమనించకుండా వాటిపై కాలు వేసింది. బాధతో అరుస్తూ బాలిక తూలి పక్కనే వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడిపోయింది. వెంటనే బాలికను తల్లిదండ్రులు వరలక్ష్మి, వీరబాబు బిక్కవోలు మండలం పందలపాకలో ఉన్న ప్రై వేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మృతి చెందింది.

మరిన్ని వార్తలు