విధి ఆడిన ఆట

19 Oct, 2019 08:05 IST|Sakshi
చిన్నారిని బయటకు తీస్తున్న దృశ్యం

ఆటాడుకుంటూలిఫ్టులో ఇరుక్కున్న చిన్నారి  

తీవ్రగాయాలతో మృతి  

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు  

హస్తినాపురం: ఓ చిన్నారితో విధి ఆటాడింది. అభం శుభం తెలియని పాపను పొట్టన పెట్టుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరుక్కుపోయి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన శుక్రవారం ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... హస్తినాపురం నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో నివాసముంటున్న చంద్రశేఖర్‌ కుమార్తె లాస్య(8) సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో ఇంటి కింద ఆడుకుంది. పైకి వెళ్లేందుకు లిఫ్టులోకి వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుపోయింది. తీవ్రంగాగాయపడిన పాప కేకలు వేయడంతో హుటాహుటిన వచ్చిన తండ్రి కష్టపడి బాలికను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. 

నాసిరకం లిఫ్టులతోనే ప్రమాదాలు..  
చిన్నారి మృతిపై బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.  కొందరు భవన నిర్మాణదారులు నాసిరకం లిఫ్టు›లు ఏర్పాటు చేస్తుండడంతోనే తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అపార్ట్‌మెంట్లలో బ్రాండెడ్‌ లిఫ్టులనే అమర్చాలని, నాణ్యమైన వాటినే ఏర్పాటు చేసేలా మున్సిపల్‌ అధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి లిఫ్టు బిగించిన నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు