అప్పు తీర్చలేదని బాలికతో వివాహం

13 Dec, 2019 11:04 IST|Sakshi

చెన్నై ,తిరువొత్తియూరు: రూ.15 వేలు అప్పు తీర్చలేక మైనర్‌ బాలికకు యువకుడితో వివాహం చేయించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను శరణాలయానికి అప్పగించారు. దిండుక్కల్‌ జిల్లా గుజిలియం పారై సమీపం గౌండనూర్‌ గ్రామానికి చెందిన మూక్కన్‌ రైతు. అతని భార్య అంజలై. వీరి కుమారుడు శరవణకుమార్‌ (23). వీరి వద్ద కరూర్‌ జిల్లా కులిత్తలై, కడవూరు సమీపంలో వున్న ఆదనూర్‌ గ్రామానికి చెందిన ఓ దంపతులు కుటుంబ ఖర్చుల కోసం రూ.15 వేలు అప్పు తీసుకున్నారు. కూలీ పనులకు వెళుతున్న వారు ఆ అప్పును తీర్చుటకు వీలు కాలేదు. ఈ క్రమంలో రూ.15 వేలు అప్పు కోసం తాకట్టుగా పాఠశాలలో చదువుతున్న తమ 13 ఏళ్ల వయసు గల తమ కుమార్తెను శరవణన్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయించారు.

ఈ మేరకు గత జూన్‌ 27వ తేదీన గుజిలియం పారైలో ఉన్న కలిక్కాలి పెరుమాల్‌ ఆలయంలో శరవణ కుమార్‌కు, బాలికతో వివాహం జరిపించారు. దీంతో రోజూ వివిధ చిత్రహింసలు అనుభవిస్తున్న ఆ బాలిక తనకు జరిగిన అఘాయిత్యం గురించి చిన్నారుల సంరక్షణ అభివృద్ధి సహాయ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో కరూర్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ పాండియరాజన్‌ బాలికకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన ఆదేశం మేరకు కులిత్తలై మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అన్నమ్‌ నేతృత్వంలో పోలీసులు విచారణ చేసి శరవణకుమార్‌ను, అతని తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేశారు. వారిని కరూర్‌ మహిళా కోర్టులో హాజరు పరిచి ఐదుగురిని తిరుచ్చి సెంట్రల్‌జైలులో పెట్టారు. బాలికను విడిపించి ఆమెకు ఆసుపత్రిలో వైద్యం చేయించి ప్రభుత్వ బాలికల శరణాలయానికి అప్పగించారు.

మరిన్ని వార్తలు