కారులో శవమై కనిపించిన చిన్నారి

26 Mar, 2020 13:30 IST|Sakshi
కారు నుంచి బాలిక మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యం

కొరాపుట్‌ జిల్లాలో ఆరేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఒడిశా, జయపురం: గత కొద్ది రోజులుగా ఆచూకీ కనిపించని ఓ మైనర్‌ బాలిక.. పాడుబడిన కారులో శవమై కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. బాలిక గొంతు వద్ద కత్తి గాట్లు ఉండటంతో ఎవరో హత్య చేసి, కారులో పడవేశారని అనుమానం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే... కొరాపుట్‌ జిల్లా లమతాపుట్‌ సమితి కొంజన గ్రామం సమీపంలో కారులో ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. మాచ్‌ఖండ్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కొరాపుట్‌ నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించిన పోలీసులు.. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంచన గ్రామానికి చెందిన ఓ వితంతువు తన ఇద్దరు కుమార్తెలతో నివసిస్తుంది. శనివారం ఆమె తన ఇద్దరు కుమార్తెలను ఇంటిలో ఉంచి, కూలి పని కోసం బయటకు వెళ్లింది. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి.. కుమార్తెలు ఇంట్లో లేరు. ఎవరింటికో టీవీ చూసేందుకు వెళ్లి ఉంటారని భావించిన ఆమె, వంటకు ఉపక్రమించింది. ఇంతలో పెద్ద కుమార్తె ఇంటికి రాగా.. చిన్న కుమార్తె ఎప్పటికీ రాకపోవడంతో గ్రామస్తులకు విషయం తెలియజేసింది. ఎంత వెతికినా ఆచూకీ కనిపించలేదు. అయితే... మరుసటి రోజు ఉదయం చూసేసరికి వారి ఇంటికి సమీపంలో ఉన్న కారులో గొంతు కోసి ఉన్న బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గమనించారు. దీంతో ఖంగుతున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసుల అదుపులో నిందితులు!
విషయం తెలుసుకున్న మాచ్‌ఖండ్‌ పోలీసులు.. బలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం లమతాపుట్‌ సమాజిక ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసు అధికారులు ప్రఫుల్లకుమార్‌ లెక్ర, శుభశ్రీకుమార్‌ పండ, జోలాపుట్, మహేశ్వర కిరసాని, నందపూర్‌ డీఎస్పీ తపనకుమార్‌ మహానంద, కొరాపుట్‌ డాగ్‌ స్క్వాడ్‌ అధికారి ఏఎస్‌ఓ శుశిల్‌ఖొర ఘటనా స్థలానికి చేరుకొని, పరిశీలించారు. శనివారం ఉదయం వేరే ప్రాంతానికి చెందిన యువకులు సంచరించారనే సమాచారం మేరకు స్థానికుల నుంచి మరిన్ని వివరాలు అడిగారు. క్లూస్‌ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. అయితే... ఎట్టకేలకు నోరు విప్పిన గ్రామస్తులు.. లమతాపుట్‌ ప్రాంతం, నందపూర్‌ సమితి కురుమపుట్‌ గ్రామం నుంచి కొంతమంది యువకులు వచ్చారని, సారా అందజేశారని తెలిపారు. వారు బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి, ఉంటారని.. తమను గుర్తించి ఉంటుందనే అనుమానంతో గొంతు కోసి, హత మార్చినట్లు అనుమానం వ్యక్తంచేశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, ఆమె తల్లికి పరిహారం చెల్లించాలని కొంజన గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా... ఘటనకు సంబంధించి కొంతమంది అనుమానిత యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు