బాలిక దారుణ హత్య

21 Feb, 2019 13:14 IST|Sakshi
గాయపడిన బాలిక తండ్రి కృష్ణ ,మృతి చెందిన బాలిక ఈశ్వరి

 తల్లితో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఘటన

వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో పెనుతుపాను రేపుతున్నాయి. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూర్రు గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక తల్లితో వివాహేతర సంబంధం తెంచుకోలేక కక్ష పెంచుకొన్న ఓ వ్యక్తి కుటుం బంపై దాడి చేసి బాలికను పొట్టనపెట్టుకున్న        సంఘటన సంచలనం రేపింది.

కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : మండలంలోని గుమ్మడిదూర్రు గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. ఊరు చివర ఇంట్లో నిద్రిస్తున్న వారిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి ఇంటి యజమానిపై దాడి చేయటంతో పాటు ఇంట్లో ఉన్న బాలికను ఎత్తుకెళ్లి హత్య చేశాడు. బాలిక అమ్మమ్మ పల్లపు రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వేముల కృష్ణ, ధనలక్ష్మి దంపతులు. వీరికి ఈశ్వరి (8), లోకేష్‌ (6) సంతానం. కృష్ణ గ్రామంలోనే వ్యవసాయ పనులు చేస్తుండగా, ధనలక్ష్మి జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలోని ఒక టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా గతంలో పని చేసేది. పనిచేసే క్రమంలో ధనలక్ష్మికి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడి రానురాను అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఇంట్లో తెలియటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తుండటంతో ధనలక్ష్మిని టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో పని మాన్పించటంతో కొంత కాలంగా గ్రామంలోనే వ్యవసాయ పనులకు వెళ్తోంది. అయినప్పటికీ సదరు వ్యక్తితో ధనలక్ష్మి ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని నాలుగు రోజుల క్రితం చిల్లకల్లులో జరిగిన ఒక దైవ కార్యక్రమం సందర్భంగా పిలిపించి పెద్దల సమక్షంలో మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆ వ్యక్తి ధనలక్ష్మిని తనతో పంపకపోతే ఏ క్షణంలోనైనా వచ్చి మీ కుటుంబ సభ్యులను చంపుతానని పలుమార్లు ఫోన్‌లో బెదిరించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వేముల కృష్ణ, ధనలక్ష్మి పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ వారి కల్యాణానికి వచ్చారు. అనంతరం ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో ఫోన్‌లో బెదిరించిన వ్యక్తి మొదట ఇనుప రాడ్‌తో కృష్ణపై దాడి చేశాడు. మరుక్షణం మంచంపై నిద్రిస్తున్న బాలిక ఈశ్వరిని లాక్కొని పరారయ్యాడు. తేరుకున్న కుటుంబ సభ్యులు అతని వెంటపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు కూడా గ్రామంలో వెతికారు. అయితే, ఎంత వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. సమాచారం తెలిసిన పోలీసులు వచ్చి గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా ఇంటి సమీపంలో కంప చెట్ల మధ్య తీవ్రంగా గాయపడి మూలుగుతున్న బాలికను గుర్తించారు. వారు వెంటనే బాలికను పెనుగంచిప్రోలు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందనట్లు వైద్యాధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. బుధవారం నందిగామ డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్, జగ్గయ్యపేట సీఐ అబ్ధుల్‌ నబీ, ఎస్‌ఐలు ఎం నాగదుర్గారావు, చిరంజీవి, ఉమామహేశ్వరరావు, క్లూస్‌ టీమ్‌ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. వేముల ధనలక్ష్మి, ఆమె తల్లి పల్లపు రమణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సీఐ నబీ మాట్లాడుతూ విచారణ జరుగుతోందని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. అయితే హత్య చేసిన వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు