తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య

16 Jul, 2018 13:01 IST|Sakshi

నాయుడుపేటటౌన్‌: పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్న బాలికను తల్లిదండ్రులు మందలించడంతో ఆమె మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటన నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ పరిధిలోని వద్దిగుంటకండ్రిగ గిరిజనకాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వద్దిగుంటకండ్రిగ గ్రామానికి చెందిన ఈటిపాకల పోలమ్మ, బత్తేయ్య దంపతుల కుమార్తె ఈటిపాకల సుభాషిణి (13) మేనకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.

కొంతకాలంగా పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం పోలమ్మ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సుభాఫిణిని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో విష గుళికలను నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాలికను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్సలు అందిస్తుండగా మృతిచెందినట్లు ఆదివారం రాత్రి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందింది. ఈమేరకు కేసు నమోదుచేసి బాలిక మృతదేహానికి సోమవారం పోస్ట్‌మార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. 

మరిన్ని వార్తలు