టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

21 Nov, 2019 09:13 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు; మనస్విత (ఫైల్‌)

చిన్నారిని చిదిమేసిన ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు

అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. తన అక్కకు టాటా చెప్పేందుకు వెళ్లిన చిన్నారిని  మృత్యువు బస్సు రూపంలో కబళించగా.. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన తమ కూతురు ఇక లేదనే చేదు నిజాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుళ్లూ.. గోపురాలు తిరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే తీసుకెళ్లాడంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

సాక్షి, సంగెం: అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన చిన్నారిని ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకా రం.. అక్క స్కూల్‌కు వెళ్తుంటే టాటా చెప్పేం దుకు వెళ్లి చెల్లెలు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాధ సంఘటన ఇది. స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కాట్రపల్లికి చెందిన కర్ర జ్యోత్స్న, అమరేందర్‌రెడ్డిలకు సమ్మిత, మనస్విత(రెండున్నర సంవత్సరాలు) సంతానం ఉన్నారు. పెద్దకూతురు వరంగల్‌ అర్బన్‌ జిల్లా మామునూర్‌ క్యాంపులోని పాత్‌ఫైండర్‌ ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ చదువుతుంది.

బుధవారం బస్సు హారన్‌ విని తల్లి పెద్ద కూతురు సమ్మితను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి చిన్న కూతురును తీసుకుని ఇంటి సమీపంలోని రోడ్డు వరకు వెళ్లింది. రోడ్‌ అటు వైపు దాటి ఆగిఉన్న బస్సులో పెద్ద కూతురును ఎక్కించింది. చిన్న కూతురును తీసుకుని బస్సు ముందు నుంచి ఇంటికి వస్తుండగా బస్సు డ్రైవర్‌ కాగితాల లింగమూర్తి ఆజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో బస్సు ముందు టైర్‌ కిందపడిన చిన్నారి మనస్విత తల పైనుంచి వెళ్లడంతో రోడ్‌పై ఉన్న కర్ర రాజిరెడ్డి, మిలుకూరి రామచంద్రారెడ్డి, మందాటి రాజేశ్వర్‌రెడ్డి చూసి కేకలు వేయడంతో బస్సును నిలిపివేశాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చిన్నారి మృతిచెందింది. చిన్నారి మనస్విత తండ్రి అమరేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కాగా, చిన్నారి మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు