ప్రాణం తీసిన గూడ్స్‌ రైలు

21 Jun, 2019 10:11 IST|Sakshi

సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : అమ్మా స్నేహితుల దగ్గరకు ఇప్పుడే వెళ్లి, వెంటనే వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కూతురు కొద్ది నిమిషాల్లోనే విగతజీవిగా మారి అనంతలోకాలకు చేరడంతో ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. తమ కూమార్తెను రైలు రూపంలో మృత్యువు తీసుకెళ్తుందని ఊహించలేదని వారు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం పట్టణంలోని పోస్టాఫీస్‌ వీధికి చెందిన సాహు అనంత్‌ కుమార్తె సువర్ణ (16) పట్టణంలోని భాస్కరా కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో చేరింది.

ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 8.7 పాయింట్లు సాధించింది. గురువారం మధ్యాహ్నం వరకు సువర్ణ ఇంటి వద్దే ఉంది. తర్వాత స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలు దేరింది. అనంతరం పార్వతీపురం బెలగాం రైల్వేస్టేషన్‌లోని ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో విశాఖపట్నం నుంచి రాయఘడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు వచ్చి ప్రమాదవశాత్తూ సువర్ణను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ట్రాక్‌ దాటే సమయంలో వద్దు గూడ్స్‌ రైలు వస్తుందని చుట్టు పక్కల వారు వారిస్తున్నా వినకుండా ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నించడమే ఆమె మరణానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సువర్ణ రైలు వచ్చేలోపు ట్రాక్‌ దాటేస్తాననుకుని వెళ్లిందని, అప్పటికే రైలు ఆమెను సమీపించడం, చుట్టు పక్కల వాళ్ల కేకలతో ఏం చేయాలో తెలియని స్థితిలో సువర్ణ కొట్టుమిట్టాడిందని, ట్రాక్‌ దాటుదామని ఎంత ప్రయత్నించినా, ఆమె సఫలం కాలేకపోయిందని, శరీరం అంతా దాటిపోయినా ఎడమ కాలు మాత్రం రైలుకు దొరికిపోయిందని, ఆ ప్రమాదంలో శరీరంలో కొంత భాగం ట్రాక్‌పై, మిగిలింది ట్రాక్‌ అవతల పడిపోయిందని చూసిన వారు చెబుతున్నారు. ఆమె భయం వల్లే ట్రాక్‌ దాటలేకపోయిందని వివరిస్తున్నారు. ట్రైన్‌ డ్రైవర్‌ కూడా బిగ్గరగా అరుస్తూ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేశారని, అది సఫలం కాలేదని పేర్కొంటున్నారు. ఈ ప్రమాదాన్ని చూసిన వారు షాక్‌కు గురయ్యారు. అమ్మాయి శరీరం రెండుగా చీలి, అక్కడ గిలాగిలా కొట్టుకోవడాన్ని చూసిన వారు చాలా సేపటివరకు షాక్‌నుంచి బయటకు రాలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు