పెళ్లికి నిరాకరించిందని...

12 May, 2018 02:15 IST|Sakshi

     ప్రగతి రిసార్ట్స్‌లో యువతి దారుణ హత్య

     తనకు దక్కనిది.. ఎవరికీ దక్కకూడదని ఘాతుకం

     కత్తితో దారుణంగా పొడిచి చంపిన ప్రేమోన్మాది

     నిందితుడి అరెస్టు.. వివరాలు వెల్లడించిన డీసీపీ పద్మజ

శంకర్‌పల్లి/చేవెళ్ల: తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిగా మారి యువతిని దారుణంగా పొడిచి చంపేశాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రగతి రిసార్ట్స్‌లో చోటు చేసుకుంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ స్వామి, శంకర్‌పల్లి సీఐ శశాంక్‌రెడ్డితో కలసి డీసీపీ పద్మజ విలేకర్లకు కేసు వివరాలు వెల్లడించారు.

ప్రేమగా మారిన పరిచయం..
కొత్తురు మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పీర్లగూడెం శిరీష(21) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతోంది. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సాయిప్రసాద్‌ ఎన్‌టీడీఎఫ్‌ కళాశాలలో డిప్లమా చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శిరీషకు సాయిప్రసాద్‌ ఇంటర్‌లో సీనియర్‌. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలియడంతో శిరీష కుటుంబీకులు గతంలో యువకుడిని హెచ్చరిం చారు. ఇటీవల వీరి మధ్య మాటలు తిరిగి మొదల య్యాయి. తనను పెళ్లి చేసుకోవాలని తరచూ సాయి ప్రసాద్‌ శిరీషను అడిగేవాడు. ఆమె అంగీకరించక పోవడంతో శిరీష ఇతరులతో స్నేహంగా ఉంటోందని, మాట్లాడుతోందని, అందుకే తనను నిరాకరించిందని అనుమానం పెంచుకున్నాడు.

హత్యకు గురైన శిరీష 

పథకం ప్రకారమే..
ఈ నేపథ్యంలో తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని శిరీషను అంతం చేయాలని సాయి ప్రసాద్‌ నిర్ణయించుకున్నాడు. ఆమెతో ప్రేమగా ఉంటున్నట్టు నటించసాగాడు. గురువారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రగతి రిసార్ట్స్‌లో కాటేజీ నంబర్‌ 11 బుక్‌ చేసిన సాయిప్రసాద్‌.. ఆమెను మభ్యపెట్టి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కారులో అక్కడికి తీసుకొచ్చాడు. కాటేజీలో పెళ్లి విషయంపై ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో శిరీష బాత్‌రూమ్‌కి వెళ్లగా.. అదే అదునుగా భావించిన సాయిప్రసాద్‌ పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో లోపలికి వెళ్లి గొంతు కోసి చంపేశాడు.

కుటుంబసభ్యులకు కాల్‌ చేసి..
అనంతరం తన చేతిని సైతం కోసుకున్న సాయిప్రసాద్‌.. కుటుంబీకులకు కాల్‌ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. ప్రగతి రిసార్ట్స్‌లో ఉన్నట్లు చెప్పడంతో కుటుంబీకులు వెంటనే రిసార్ట్స్‌ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అయితే, అప్పటికే సాయిప్రసాద్‌ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రూమ్‌ తెరిచి చూడగా శిరీష రక్తపు మడుగులోపడి ఉంది. ఘటనాస్థలంలో నిందితుడు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించారు.

హత్య తర్వాత సాయిప్రసాద్‌ పారిపోవడంతో పోలీసులు మూడు టీమ్‌లుగా ఏర్పడి బాలాజీ టెంపుల్‌ రోడ్డు చౌరస్తాలో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. కాగా, శిరీష రిసార్ట్‌కు ఎప్పుడు వచ్చింది.. సాయిప్రసాద్‌తో పాటు మరెవరైనా ఉన్నారా అని ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు