స్కూల్లో ఘోరం : బాలికకు 168 చెంపదెబ్బలు

27 Jan, 2018 20:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఝబువా, మధ్యప్రదేశ్‌ : హోం వర్క్‌ చేయలేదని పన్నెండేళ్ల బాలికను 168 చెంపదెబ్బలు కొట్టించాడో కసాయి టీచర్. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా తాండ్లా పట్టణంలోని నవోదయ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ నెల 11 తేదీ నుంచి 16వ తేదీ వరకూ రోజూ 14 మంది తోటి బాలికలతో తన కూతురిని సైన్స్‌ టీచర్‌ చెంపదెబ్బలు కొట్టించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చెంపదెబ్బలతో తీవ్రంగా భయపడిన బాలిక అనారోగ్యం పాలైందని ఆమె తండ్రి శివ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. నవోదయలో సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్న మనోజ్‌ కుమార్‌ వర్మ హోం వర్క్‌ ఇవ్వగా అనారోగ్యం కారణంగా బాలిక చేయలేదని ప్రతాప్‌ సింగ్‌ వెల్లడించారు. అయితే, హోం వర్క్‌ చేయనందుకు శిక్షగా మనోజ్‌ ఆరు రోజుల పాటు 168 చెంపదెబ్బలు కొట్టించారని చెప్పారు.

కాగా, ఈ ఘటనపై స్పందించిన నవోదయ ప్రిన్సిపాల్‌ సాగర్‌... అది కేవలం ఫ్రెండ్లీ పనిష్మెంట్‌ మాత్రమే అని అన్నారు. బాలికను గాయపర్చాలనే ఉద్దేశంతో టీచర్‌ అలా చేయలేదని సర్ది చెప్పేందుకు యత్నించారు. బాలిక తల్లిదండ్రులతో ఈ విషయంపై చర్చించి సమస్యను పరిష్కరించుకుంటామని వివరించారు.

మరిన్ని వార్తలు