ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. పొమ్మన్నాడు..!

9 May, 2018 13:38 IST|Sakshi

రాంచీ యువతితో విశాఖ వాసి ప్రేమాయణం

నాలుగేళ్ల సహజీవనం తర్వాత మరో మహిళతో రహస్యంగా వివాహం 

 ఆపై పోలెండ్‌కు పలాయనం

ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనకు  సిద్ధమవుతున్న ప్రియురాలు 

సాక్షి, విశాఖపట్నం: ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరారు. కొన్నాళ్లకు మనసులు కలిశాక ఒకరికొకరు చేరువయ్యారు. ఆమెను పెళ్లాడుతానని మాటిచ్చాడు. ఇద్దరి మతాలు వేరవడంతో తమ తల్లిదండ్రులు పెళ్లికి ఇష్టపడరని ప్రియుడు ప్రియురాలికి చెప్పి ఆమెతో సహజీవనం సాగించాడు. అతడిని నమ్మిన ఆమె తన శరీరాన్నే కాదు.. కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయల జీతాన్నీ ఇచ్చేసింది. ఇలా నాలుగేళ్లు గడిచాక ఉన్నత విద్యాభ్యాసం పేరిట పోలెండ్‌కు వెళ్లిపోయాడు. 

అటు నుంచి వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ మాట ప్రకారమే పెళ్లి చేసుకున్నాడు.. కానీ ప్రియురాలిని కాదు.. మరో యువతిని. ఆ సంగతి తెలిసిన ప్రియురాలు నిలదీయడంతో మతాలు వేరు కావడం వల్ల తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, మరో దారి చూసుకోమని సలహా ఇచ్చి భార్యతో పోలెండ్‌ వెళ్లిపోయాడు. పరాయి రాష్ట్రం జార్ఖండ్‌ నుంచి వచ్చిన ఆమె విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో విశాఖలోని ప్రియుని ఇంటి ఎదుట ఆందోళనకు సిద్ధమవుతోంది. తనలా మరో యువతి మోసపోకూడదంటూ ఆమె పోరుబాట పట్టనుంది. 

జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీకి చెందిన సోనీకుమారిసింగ్, విశాఖ పరిధి కంచరపాలెంకు చెంది న రఫీషేక్‌లు విశాఖ రుషికొండలోని సదర్‌లాండ్‌ గ్లోబల్‌ కంపెనీ అనే బీపీవో సంస్థలో సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉద్యోగం చేసేవారు. అక్కడ వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్ల అనంతరం 2012లో ఆ సంస్థ శాఖ విశాఖలో మూతపడడంతో ఉద్యోగులను చెన్నైకి బదిలీ చేసింది. సోనీకుమారి, రఫీషేక్‌లు చెన్నైకి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికొచ్చిన వీరు చెన్నై, ఢిల్లీల్లో కొన్నాళ్లు సహజీవనం చేశారు.

ఉన్నత విద్యనభ్యసిస్తే మెరుగైన ఉద్యోగం వస్తుందని, అప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవచ్చని, పెళ్లికి తమ తల్లిదండ్రులను కూడా ఒప్పించానని సోనీని రఫీ నమ్మించాడు. అక్కడ చదువుకు రూ.2 లక్షలు అవసరమవుతుందని చెప్పడంతో తాను కష్టించి సంపాదించిన జీతం సొమ్మును ఇచ్చింది. దీంతో రఫీ 2013లో పోలెండ్‌ ఉన్నత చదువులకు వెళ్లాడు. అప్పటి నుంచి ఏటా ఒకసారి వచ్చి చెన్నైలో ఉంటున్న సోనీతో కొన్నాళ్లు గడిపి వెళ్లేవాడు. అక్కడ చదువు పూర్తి  కాగానే ఉద్యోగంలోనూ చేరాడు. 2018లో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో సోనీ తమ వివాహం గురించి రఫీని ఒత్తిడి చేసేది. 2017 సెప్టెంబర్‌ వరకు సఖ్యతగా ఉన్న ఆయన ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. 

ఇద్దరివి వేర్వేరు మతాలు కావడంతో ఆమెతో పెళ్లికి తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, అందువల్ల మరొకరితో వివాహం చేసుకోవాలని సూచించాడు. అందుకు ఆమె సమ్మతించకపోవడంతో తన తల్లిదండ్రులను ఒప్పించడానికి కొంత సమయం కావాలన్నాడు. ప్రియుడి మోసాన్ని జీర్ణించుకోలేని సోనీకుమారి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉద్యోగాన్ని వదిలేసి రాంచీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. 

ఇంతలో ఈ ఏడాది జనవరి 7న రఫీ మరొక మహిళను విశాఖలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న సోనీకుమారి అదే నెల 10న కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి మోసం చేసిన రఫీ షేక్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇప్పటిదాకా రఫీపై పోలీసులు చర్యలు తీసుకోలేదని, పైగా ఆ కుటుంబంతో రాజీ కుదుర్చుకోమని సలహా ఇస్తున్నారని సోనీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ డి.నాగేంద్రకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. 

రఫీ ఇంటి ముందు ఆందోళనకు దిగుతా
రఫీ షేక్‌ నన్ను మోసం చేసి మరో మహిళను పెళ్లాడాడు. ఆర్థికంగానూ నష్టపరిచాడు. నాలా మరే మహిళా రఫీ చేతిలో మోసపోకూడదు. అందుకే రఫీ ఇంటి ఎదుట ఆందోళన చేపడతా. నాకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తా. 
– సోనీకుమారిసింగ్, బాధితురాలు

అరెస్టు నోటీసులు జారీ చేశాం
బాధితురాలు సోనీకుమారిసింగ్‌ ఫిర్యాదు మేరకు రఫీషేక్‌ అరెస్టుకు నోటీసులు జారీ చేశాం. సోనీకుమారి ఢిల్లీలోనూ రఫీషేక్‌తో సహజీవనం చేయడంతో అక్కడ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించాం. కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఢిల్లీకి పంపుతాం. 
– డి.నాగేంద్రకుమార్, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు