అక్రమ రవాణాలో బాలికలే టార్గెట్‌

17 Aug, 2018 03:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకవైపు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు బలంవంతపు వ్యభిచారం రొంపిలో మైనర్లను దించి వ్యాపారం చేసే ధోరణి పెచ్చుమీరుతోంది. మానవ అక్రమ రవాణా ముఠాలు ప్రధానంగా మైనర్‌ బాలికలను టార్గెట్‌ చేస్తున్నాయి. చిన్నపిల్లలైతే ప్రతిఘటించలేరనే ధీమాతో వారిని భయపెట్టి ఏ పని అయినా చేయించవచ్చనే ఉద్దేశంతో అక్రమ రవాణా ముఠాలు దారుణాలకు ఒడిగడుతున్నాయి. వ్యభిచార గృహాలు, పరిశ్రమలు, ఇళ్లల్లో, దుకాణాల్లో, ఇటుక బట్టీలు, హోటళ్లలో పని చేసేందుకు చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారు. ఇటీవల చిన్నారులతో వ్యభిచారానికి గిరాకీ పెరిగిందని పలు సంస్థల అధ్యయనంలో వెల్లడైంది.  

గడిచిన మూడేళ్లలో నమోదైన కేసులు, చిన్నారుల విముక్తిని పరిశీలిస్తే రాష్ట్రంలో మైనర్ల అపహరణ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2015లో 40 కేసుల్లో 40 మందికి, 2016లో 49 కేసుల్లో 67 మందికి, 2017లో 77 కేసుల్లో 84 మందికి విముక్తి లభించింది. ఏదో మొక్కుబడిగా అన్నట్టుగా గుంటూరులో 2017లో ఒక కేసు, రాజమహేంద్రవరంలో 2016లో ఒకటి, 2017లో నాలుగు కేసులు నమోదు చేశారు. విజయవాడలో 2016లో ఒకటి, 2017లో 2 కేసులు నమోదు చేశారు.

విశాఖపట్నం 2015లో 2, 2017లో ఒకటి, శ్రీకాకుళంలో 2015 ఒకటి కేసు మాత్రమే నమోదు చేశారు. తూర్పు గోదావరిలో 2017లో మూడు కేసులు, పశ్చిమ గోదావరిలో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒక కేసు మాత్రమే నమోదు చేశారు. చాలా జిల్లాల్లో కనీసం మైనర్‌ బాలల అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మైనర్‌ బాలల అక్రమ రవాణాపై, బాలల వెట్టి చాకిరిపై దృష్టి పెట్టాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.   

మరిన్ని వార్తలు