అరబ్‌ పంజరం

26 Apr, 2018 03:37 IST|Sakshi

ఉపాధి పేరుతో అమ్మాయిలను గల్ఫ్‌ దేశాలకు తరలింపు 

అక్కడ లక్ష నుంచి 5 లక్షలకు అమ్ముతున్న ఏజెంట్లు 

ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్న అమ్మాయిలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి పేరిట కామాంధులైన అరబ్‌ షేక్‌ల దాష్టీకానికి నగర అమ్మాయిలు ఎందరో సమిధలవుతూనే ఉన్నారు. అరబ్‌ షేక్‌లు నగరానికి రాకుండా ఇక్కడి అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో అక్కడికి పిలిచి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాలో ట్రావెల్‌ ఏజెంట్లు దళారులుగా వ్యవహరించి నిండు జీవితాలను బలిచేస్తున్నారు. ఉపాధి పేరుతో నగర అమ్మాయిల అక్రమ రవాణాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం....  

నెలకు 20 మంది రవాణా.. 
కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌లు, ఖాజీలపై పోలీసుల ఉక్కుపాదంతో అరబ్‌ షేక్‌లతో అమ్మాయిల పెళ్లిళ్లు తగ్గాయి. కానీ ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను అరబ్‌ దేశాలకు తరలించడం ఇంకా సాగుతూనే ఉంది. బ్యూటీషియన్లు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు, సేల్స్‌గర్ల్, రిసెప్షనిస్టు, ఇంటి పనులు తదితర వీసాలపై అమ్మాయిలను ఏటా వందల సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు తీసుకెళ్తున్నారు. ట్రావెల్‌ ఏజెంట్లు అక్కడి దళారులతో కుమ్మక్కై అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు ఉద్యోగాల ఎర వేస్తున్నారు. ఇక్కడైతే ఐదారువేలే సంపాదించవచ్చని.. అరబ్‌ దేశాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్జించవచ్చని మాయ మాటలు చెప్పి వారిని నమ్మిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కొందరు మహిళలను ప్రతినిధులుగా నియమిస్తున్నారు.  

చెప్పేదొకటి.. జరిగేది ఇంకోటి.. 
దళారులు, ఏజెంట్లు ఇక్కడి నుంచి అమ్మాయిలను జాబ్‌ వీసాపై పంపిస్తారు. అక్కడి వెళ్లిన తరువాత వీసా జారీ చేసిన షేక్‌కు వారిని అమ్మేస్తారు. పెళ్లి కాని అందమైన అమ్మాయిని రూ.5 లక్షలు, పెళ్లి అయిన మహిళని రూ.3 లక్షలు, వయసు ఎక్కువున్న మహిళను రూ.లక్షకు కొంటున్నారు. కొందరు అక్కడి నరకం భరించలేక బయటికొచ్చి చెప్పుకుంటున్నారు. మరి కొందరు అదే నరకంలో ఉండిపోతున్నారు.  

నరకం అనుభవించా.. 
సేల్స్‌గర్ల్‌ ఉద్యోగం ఉందని నమ్మించి ఏజెంట్లు నన్ను దుబాయికి పంపించారు. షార్జా ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తర్వాత ఏజెంట్‌ వచ్చి ఓ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. ఒక్కో షేక్‌ వచ్చి శరీరాన్నంతా తడిమి ఎంపిక చేసుకొని తీసుకెళ్లేవాడు. రోజుకో షేక్‌ రావడం తీసుకెళ్లడం.. నేను వెళ్లనని చెబితే తీవ్రంగా కొట్టేవారు. రూ.3.5 లక్షలకు విక్రయించామని ఏజెంట్‌ చెప్పాడు. ఆ నరకం భరించలేక మా అమ్మకు విషయం చెప్పాను. దీనిపై కేంద్రానికి ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్‌ లేఖ రాయడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు నన్ను విడిపిం చారు.      
            – అస్మా బేగం, హబీబ్‌నగర్‌ 

నా కూతురిని విడిపించండి 
బ్యూటీషియన్‌ వీసా ఉందని నమ్మించి ఏజెంట్‌ నా కూతుర్ని దుబాయికి పంపాడు. అక్కడికి వెళ్లిన తరువాత నా కూతురిని షేక్‌ అమ్మేయడంతో, ఇంటి పనితో పాటు పడక పని చేయిస్తున్నారు.  నాకు ఫోన్‌ చేసి.. ఈ నరకం నుంచి రక్షించండి అని వేడుకుంది.     
    – హలీమ్‌ ఉన్నీసా తల్లి హబీబ్‌ ఉన్సీసా, వట్టేపల్లి

ఎందరినో రక్షించాం
ఇమిగ్రేషన్‌ అధికారుల నిర్లక్ష్యంతో అమ్మాయిల అక్రమ రవాణా సాగుతోంది. ఏజెంట్ల మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. అలాంటి దుర్మార్గులపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపిస్తేనే అమ్మాయిల రవాణాకు అడ్డుకట్టపడుతుంది. అలాగే ప్రజల్లోనూ ఇలాంటి ఉద్యోగాలపై అవగాహన కల్పించాలి.   
 – అంజదుల్లాఖాన్,ఎంబీటీ అధికార ప్రతినిధి 

మరిన్ని వార్తలు