యాదగిరిగుట్ట వద్ద వెలుగులోకి వస్తున్న వాస్తవాలు

8 Aug, 2018 14:45 IST|Sakshi
యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు శివారులో తాళం వేసి ఉన్న వ్యభిచార గృహాలు

అధిక వడ్డీలకు ఇక్కడే అప్పులు

హెచ్‌ఐవీతో కుటుంబాలు చిన్నాభిన్నం

52ఏళ్లుగా కొనసాగుతున్న దందా

హార్మోన్‌ ఇంజక్షన్లు ఎక్కడినుంచి వస్తున్నాయనే కోణంలో విచారణ

పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నబాధితులు

యాదగిరిగుట్ట :  వ్యభిచార గృహాల నిర్వహణ.. చిన్నపిల్లలను ఈ రొంపిలోకి దింపుతున్న వ్యవహారంలో వాస్తవాలు యాదగిరి గుట్టలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 52 ఏళ్లుగా సాగుతున్న ఈ దందాకు అవసరమైన పెట్టుబడులకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేసే ప్రబుద్ధులు ఇక్కడే ఉన్నారు. మరో వైపు ప్రాణాంతకమైన హెచ్‌ఐవీ వ్యాధి సోకి మృత్యువాతపడ్డ తల్లిదండ్రులు, అనాథలైన పిల్లలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నాయి.

ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన పడుపు వృత్తి పుణ్యక్షేత్రానికే మాయని మచ్చగా మిగిలింది. సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట నుంచి పిల్లలతో సహా పారిపోయిన 110 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులు ఎక్కడ ఉన్నారనేది తెలియకుండా పోయింది. 15మంది బాలికలను వ్యభిచార ముఠా కబంధ హస్తాల నుంచి పోలీసులు, అధికారులు రక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొంత మంది బాలికలు వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారని పోలీసులకు పట్టుబడిన చిన్నారులు చెప్పారు. వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇళ్లకు తాళాలు వేసి యాదగిరిగుట్టనుంచి పారిపోవడంతో వారు ఎక్కడ ఉన్నారో అన్నది మిస్టరీగా మారింది.

పిల్లలు సురక్షితంగా ఉన్నారా లేక ఇతర ముఠాలకు అమ్మి వేశారా, దూర ప్రాంతాలకు తరలించారా అన్న ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది. మరో Ðవైపు రక్షించిన చిన్నారుల్లో తమ వారు ఉన్నారేమోనని తప్పిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా వరంగల్‌కు చెందిన తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్లు ఏడాది కాలంగా కనిపించకుండాపోయారని బంధువులు వచ్చారు. యాదగిరిగుట్టలో పోలీసులు రక్షించిన బాలికల్లో తమ పిల్లల పోలికలు ఉన్నాయని తెలిపారు.

1966లో పడుపు వృత్తి ప్రారంభం

మెదక్‌ జిల్లా రామయంపేట నుంచి 1966లో కంసాని బూరే అనే వ్యక్తి యాదగిరిగుట్టకు కుటుంబంతో వచ్చి పడుపు వృత్తిని ప్రారంభించాడు. ఒక్క కుటుంబంతో ప్రారంభమైన ఈ వృత్తిలోకి వేలాది మంది వచ్చి వెళ్లారు. ప్రస్తుతం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వందకు పైగా కుటుంబాలు వృత్తిని నిర్వహిస్తున్నాయి. గతంలో మహిళలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయించేవారు. అయితే క్రమంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు ఆడ పిల్లలను కొనుగోలు చేసి అమానవీయంగా వారిని వృత్తిలోకి దించుతున్న విషయం తాజాగా వెలుగు చూసింది.

పడువు వృత్తికి యాదగిరిగుట్టలో పలువురు రాజకీయ నేతలు, పోలీసు అధికారుల అండదండలు ఉండటం వల్లే వారు ఈస్థాయికి ఎదిగారనేది బహిరంగ రహస్యం. పడుపు వృత్తిలోకి కొత్తగా వచ్చిన వారిని ముందుగా ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల వద్దకు పంపించే ఆనవాయితీ కొంతకాలం క్రితం వరకు కొనసాగింది. దీంతో వారు నిర్భయంగా దందాను కొనసాగిస్తూ వచ్చారు. 

అప్పులిచ్చే వారు దండిగానే..

వ్యభిచార నిర్వాహకుల అవసరాలకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వ్యాపారులు గుట్టలో ఉన్నారు. ఐదారుగురు ఫైనాన్స్‌ వ్యాపారులు రోజువారీ ఫైనాన్స్‌ ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఇందులో ఆడపిల్లల కొనుగోలుకు పెట్టుబడిగా అప్పులు ఇచ్చి వారు పెద్దయి వృత్తిలోకి దిగిన తర్వాత డబ్బులు వసూలు చేసుకునే విధానం కొంతకాలంగా కొనసాగుతోంది. రూ.లక్ష ఫైనాన్స్‌గా తీసుకున్న వారు రోజు రూ.1,000చొప్పున మూడు నెలల పది రోజుల్లో చెల్లించాలి. ఇందుకోసం పడుపు వృత్తిని వదలని పరిస్థితి కొందరిలో నెలకొంది. 

హైదరాబాద్‌లో ఉన్నారా?

పారిపోయిన వ్యభిచార నిర్వాహకులు వారి వద్ద ఉన్న పిల్లల  కోసం పోలీసులు మూడు బృందాలు గా వెతుకుతున్నారు.  గతంలో దాడులు జరిగినప్పుడు వీరంతా వారి బంధువుల ఇళ్లకు వెళ్లి అం తా సద్దుమణిగిన తర్వాత కొంత కాలానికి తిరిగి గుట్టకు చేరుకునేవారు. అయితే ప్రస్తు తం పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వ్యభిచార నిర్వాహకులు హైదరాబాద్, ముంబయి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, విశాఖపట్నం దూ ర ప్రాంతాలకు తరలిపోయి రహస్యంగా తలదా చుకుని ఉండొచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. 

ఎక్కడి నుంచి వస్తున్నాయి

నిషేధిత ఈస్ట్రోజన్,  ఆక్సిటోసిన్‌  వంటి నిషేధిత ఇంజక్షన్లు ఎక్కడినుంచి సరఫరా అవుతున్నాయి.. వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారన్న కోణంలో పోలీసులు చేపట్టిన విచారణ ముందుకు సాగడం లేదన్న అనుమానం వ్యక్తమవుతోంది.  శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో గల మెడికల్‌ దుకాణాలపై దాడులు నిర్వహించిన అధికారులకు ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత ఇంజక్షన్‌లతో పాటు ఆల్కాహాల్‌ శాతం అధికంగా ఉండే  కోరెక్స్‌ దగ్గు మందు బయటపడింది. తనిఖీల్లో బయటపడిన నిషేధిత మందులు ఎక్కడ కొనుగోలు చేశారు.

వాటికి సంబంధించిన బిల్లులు, కంపెనీల వివరాలు సమర్పించాలని కోరారు. ఈ నిషేధిత మందులు ఇక్కడే అమ్ముతున్నారా, పడువు వృత్తి కొనసాగుతున్న రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నారా అంటే నిజమేనని కొందరు మెడికల్‌  ఏజెంట్లు చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో పడువు వృత్తి సాగుతున్న అన్ని ప్రాంతాల్లో స్టిరాయిడ్స్‌ అమ్ముతున్నా అవి బయట పడడం లేదు. తాజా సంఘటనతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తత కావాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. 

వందలాది కుటుంబాలు చిన్నాభిన్నం1993 తర్వాత హెచ్‌ఐవీ మహమ్మారి యాదగిరిగుట్టలో బయటపడింది. యాదగిరిగుట్టతోపాటు పరిసర గ్రామాలు, ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది తొలినాళ్లలో వేశ్య వృత్తిలో ఉన్న వారితోపాటు వారి వద్ద శారీరక సుఖం కోసం వెళ్లిన వందలాది మంది మృత్యువాతపడ్డారు. బయటికి చెప్పుకోలేని కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వేశ్యల వద్దకు వెళ్లి హెచ్‌ఐవీ బారినపడి  భర్తలు చనిపోయిన భార్యలు,  కూతుర్లను, కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు ఉన్నారు.

ఎక్కువగా 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు వారే మృతుల్లో ఉన్నారు. హెచ్‌ఐవీ సోకిందని తెలిసి పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. పెళ్లికి ఇచ్చిన కట్నం పుట్టింటి వారికి తిరిగి చెల్లించడానికి ఆస్తులను అమ్ముకున్న అత్తింటి వారు ఉన్నారు. పుట్టింటికి చేరిన ఆడ పిల్లలు  ఆతర్వాత హెచ్‌ఐవీ బారినపడి మృత్యువాతపడిన సంఘటనలు ఉన్నాయి.    

మరిన్ని వార్తలు