‘తల్లి’డిల్లుతున్నారు..   

9 Aug, 2018 14:34 IST|Sakshi
 ఈ నెల 3న వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన తల్లిదండ్రులు (ఫైల్‌) 

యాదగిరిగుట్ట(ఆలేరు) : ‘‘ముక్కు పచ్చలారని మా పిల్లలను కొందరు దుండగులు మా నుంచి దూరం చేశారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా దొరికిన పిల్లలపై వస్తున్న కథనాలను చూసి మా పిల్లల ఆచూకీ కోసం వచ్చాం. ఇటీవల వ్యభిచార ముఠా చెర నుంచి విముక్తి పొందిన పిల్లల్లో మా పిల్లలు ఉన్నారేమో చూడండి’ అని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఏసీపీ, సీఐలను ఆశ్రయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మతం చిన్న దిబ్బయ్య–విశ్రాంతమ్మ దంపతులు తన కూతురు చిన్ని మార్కపురం వద్ద హాస్టల్లో చదువుకుంటూ  2017 నుంచి కనిపించడం లేదని యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. అదేరోజు ఈసీఐఎల్‌కు చెందిన అనురాధ–కృష్ణ దంపతులు తమ కూతురు ఇందు  2014 లో కుషాయిగూడలో వినాయకచవితి పండగ నుంచి కనిపించకుండా పోయిందని కలిశారు.

15మంది చిన్నారుల్లో తమ కూతురు కల్పన ఉండొచ్చని బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగని నందం–భాగ్యమ్మ దంపతులు యాదగిరిగుట్ట టౌన్‌ సీఐ అశోక్‌ కుమార్‌ను ఈనెల 4న∙కలిశారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం చిన్నకోడూర్‌కు చెందిన ఆరేళ్ల ఎల్లమ్మ  27–7–2018 నుంచి కనిపించడం లేదని పాప తండ్రి పెద్ద నర్సింహులు ఈనెల 5వ తేదీన యాదగిరి గుట్ట పోలీసులను ఆశ్రయించారు.

విజయవాడలోని మచ్చనారాయణపురానికి చెందిన మూడేళ్ల చిన్నారి త్రివేణి అక్కడ రైల్వే స్టేడియం దగ్గర 22–8–2015న కూర్చోని రో డ్డుపైకి వెళ్లి వచ్చే సరికి కనిపించడం లేదని ఆమె తండ్రి రెడ్డి రమణ 5వ తేదీన వచ్చారు.విజయవాడకు చెందిన మల్లీశ్వరి–కుమారుల మూడో కుమార్తె గరికపాటి అనుష(4) 24–4–2017న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని ఈనెల 5న  పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. 

గోషమాల్‌లోని బేగంబజార్‌కు చెందిన ఆరేళ్ల కుమారి రజిత 2006 నుంచి కనిపించకుండా పోయిందని, అప్పటి నుంచి తన కూతురిని వెతుకుతున్నామని తండ్రి మల్లేష్‌ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు ఈనెల 6వ తేదీన వచ్చాడు. వరంగల్‌ జిల్లా కేంద్రంలోని చిత్రాసికుంటకు చెందిన అయిలమ్మ తమ కూతురు ప్రవళిక(26)తో పాటు మనవరాల్లు కూతుర్లు వైష్ణవి (4), విశాల(3)లు ఏడాది క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయారని వచ్చింది.

అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన మధులత–భగవాన్‌ దంపతులు ఐదేళ్ల కూతురు లిఖిత 5–8–2012లో తమ హోటల్‌లో పనికోసం వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుపోయాడని 7వ తేదీన (మంగళవారం) తల్లి మధులత యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కు ఆశ్రయించి తమ పిల్లల ఆచూకీ తెలిపాలని కోరారు.

డీఎన్‌ఏ టెస్టులు చేయిస్తాం..

ఇటీవల వ్యభి చా ర గృహాల నిర్వాహకుల నుంచి విముక్తి పొందిన చిన్నారుల్లో ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌ ప్రజ్వల హోమ్స్‌లో 11మంది, మరో నలుగురు స్త్రీ, శిశు సంక్షేమ సంరక్షణలో క్షేమంగా ఉన్నారు. పిల్లలు తప్పిపోయినప్పుడు ఆయా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సమయంలో ఇచ్చిన ఫొటోలను కొంతమంది తల్లిదండ్రులు తీసుకువచ్చి చూపెడుతున్నారు.    చిన్నారులకు, వారి తల్లిదండ్రులుగా వచ్చిన వారికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించిన తర్వాత అప్పగిస్తాం.

– అశోక్‌కుమార్, టౌన్‌ సీఐ, 

మరిన్ని వార్తలు