ఏసీబీ ముందు గోవా ప్రతిపక్షనేత హాజరు

9 Feb, 2018 15:00 IST|Sakshi
గోవా ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్‌ కావ్లేకర్‌

పణజి: గోవా ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు  చంద్రకాంత్‌ కావ్లేకర్‌ శుక్రవారం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ముందు హాజరయ్యారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారని గత సంవత్సరం ఆయనపై, ఆయన భార్య సావిత్రిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 5న కావ్లేకర్‌కు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ రాబోయే అసెంబ్లీ సెషన్స్‌ కారణంగా తాను తీరిక లేకుండా ఉన్నానని ఐదో తారీఖున రాలేకపోతున్నానని ఇదివరకే తెలిపారు.

తాను అమాయకుడినని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలనీ, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని చంద్రకాంత్‌ తెలిపారు. కావ్లేకర్‌ ఇప్పటికే స్థానిక కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాడు. ఫిబ్రవరి 12 వ తేదీ వరకు అతన్ని అరెస్టు చేయకుండా కోర్టు నుంచి అనుమతి పొందాడు. 2007 జనవరి నుంచి 2013 ఏప్రిల్‌ మధ్యకాలంలో గోవా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి కేరళలో ఆస్తులు కొనుగోలు చేశారని ఆయనపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు