గాడ్సే పుట్టిన రోజు వేడుకలు.. 6గురు అరెస్ట్‌

21 May, 2019 09:44 IST|Sakshi

గాంధీనగర్‌ : మహాత్మున్ని చంపిన గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన  ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. సూరత్‌కు చెందిన హిందూ మహాసభ కార్యకర్తలు.. లింబాయత్‌ ప్రాంతంలోని సూర్యముఖి హనుమాన్‌ ఆలయంలో ఆదివారం గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గాడ్సే ఫోటో చుట్టూ దీపాలు వెలిగించి.. పూజలు చేశారు. స్వీట్లూ పంచుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. అంతటితో ఊరుకోక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని వారిని అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘మహాత్మ గాంధీని చంపిన నేరస్థుడికి పుట్టిన రోజుల వేడుకలు నిర్వహిచండం నిజంగా చాలా విచారకరం. ఇలాంటి పనులు వల్ల దేశ ప్రజలు మనోభావాలు దెబ్బ తింటాయి. ఫలితంగా గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ చర్యలకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేశామ’ని తెలిపారు. ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి భరత్‌ పాండ్య మాట్లాడుతూ.. ‘గాంధీజిని అవమానించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిదే. బుద్ధి లేని వారే ఇలాంటి తలకు మాసిన పనులు చేస్తారు. వారికి మహాత్ముడి ఆదర్శాలు ఎన్నటికి అర్థం కావ’న్నారు.

మరిన్ని వార్తలు