టార్గెట్‌ బిగ్‌ షాట్స్‌

28 Nov, 2018 09:38 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

ఖరీదైన ప్రాంతాల్లోనిఇళ్లే లక్ష్యం  

ఏడు చోరీలు.. రూ.కోటికి పైగా సొత్తు చోరీ

ప్లాటినం, వజ్రాలు, బంగారం తప్ప మరోటి ముట్టుకోడు

సిటీ, ఏపీ, తమిళనాడుల్లోపలు కేసులు

మూడు రాష్ట్రాల పోలీసులకు వాంటెడ్‌

సాక్షి, హైదరాబాద్‌: జైల్లో కలుసుకున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠా ఏడు నేరాలు చేసింది. కరుడు గట్టిన దొంగ కర్రి సతీష్‌ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల్లోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్‌గా చేసింది. ఈ ఏడు దొంగతనాల్లో రూ.1.05 కోట్ల సొత్తును ఎత్తుకుపోయింది. ఇంట్లోకి ప్రవేశించి కేవలం ప్లాటినం, బంగారు, వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన ఆభరణాలు మాత్రమే ఎత్తుకుపోవడం వీరి నైజం. మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఈ గ్యాంగ్‌ను హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వీరి నుంచి ప్లాటినం, బంగారంతో చేసిన నగలతో పాటు వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, చెన్నై, నెల్లూరు పోలీసులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. 

సెల్‌ఫోన్‌తో చోరీలు మొదలెట్టి..
విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్‌ అలియాస్‌ సత్తిబాబు కారు డ్రైవర్‌. 2005లో తొలిసారి ఓ ఇంట్లో వాహనం చోరీ చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆపై విశాఖలోనే 17 చోరీలు చేయడంతో పాటు అంతర్రాష్ట్ర దొంగగా మారిపోయాడు. కాకినాడ, విజయనగరం, విజయవాడ, హైదరాబాద్, సూర్యాపేట, బెంగళూరుల్లో మొత్తం 48 చోరీలు చేశాడు. సత్తిబాబు బాధితుల్లో అత్యధికులు ప్రముఖులు, సంపన్నులే. ఇతడిపై హైదరాబాద్‌ పోలీసులు 2016లో పీడీ యాక్ట్‌ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్‌ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్‌తో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో అలా చేస్తే ఉపయోగం లేదని, ‘థింక్‌ బిగ్‌’ అంటూ నూరిపోశాడు. మార్చిలో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది. ఈ ఏడాది మార్చిలో శ్రీకాకుళంలో ఓ చోరీ చేశాడు. ఆపై బెంగళూరులోను, చెన్నైలోని మూడు ప్రాంతాల్లో, ఏపీలోని నెల్లూరులో ఒకటి. నగరంలోని బంజారాహిల్స్‌లో మూడు నేరాలు చేశాడు. చెన్నైలోని నుంగంబక్కం పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసించే డాక్టర్‌ కౌశిక్‌ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు ఎత్తుకుపోయాడు.

దొరికినా నిజాలు చెప్పడు
తన వెంట ఎప్పుడు స్క్రూడ్రైవర్, కటింగ్‌ ప్లేయర్‌ ఉంచుకుని తిరిగే సత్తిబాబు ఈ ఏడు నేరాల్లోనూ ఇంటి గ్రిల్స్‌ తొలగించో, తాళం పగులగొట్టో లోపలకు ప్రవేశించాడు. నరేంద్ర ఇతడితో పాటు లోపలకు వెళ్తుండగా.. శ్రీనివాస్‌ బయటుండి పరిస్థితులు గమనిస్తుంటాడు. శ్రీకాకుళం, బెంగళూరు కేసులకు సంబంధించి అక్కడ అధికారులకు దొరికినా.. బయటి కేసుల వివరాలు మాత్రం చెప్పలేదు. జైల్లోంచి బయటకు వచ్చి మళ్లీ మరో ప్రాంతంలో నేరం చేయడం మొదలెట్టాడు. ఈ ముఠా కోసం చెన్నై పోలీసులు 18 టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలించినా ఫలితం దక్కలేదు. వీరి కదలికలపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ నార్త్‌జోన్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం కాపుకాసింది. మంగళవారం చోరీ సొత్తు విక్రయించడానికి ముంబై వెళ్తున్నారని తెలిసి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పట్టుకుంది. విచారణలో తాము మరికొంత సొత్తును కడపకు చెందిన కె.సుధీర్‌కుమార్‌రెడ్డికి విక్రయించినట్లు చెప్పడంతో అతడిని కూడా పట్టుకుని రూ.1.05 కోట్ల విలువైన 1,712 గ్రాముల ప్లాటినం, బంగారం, వజ్రాలు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులు, నాన్‌–బెయిలబుల్‌ వారెంట్ల నేపథ్యంలో సత్తిబాబు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు.

సత్తిబాబు బాధితుల్లోకొందరు ప్రముఖులు
విశాఖపట్నంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లో
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్‌ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లో
బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్‌ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీలు చేశారు. అక్కడి సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి యత్నించాడు.
2016లో ఏప్రిల్‌ 28న ఫిలింనగర్‌ సినార్‌ వ్యాలీలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎస్‌ఎస్‌ శర్మ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.  
గతేడాది పీడీ యాక్ట్‌లో అరెస్టయిన సత్తిబాబు ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న విడుదలయ్యాడు. ఆ తెల్లవారే ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్‌ రామారావు ఇంట్లో విలువైన సొత్తును తస్కరించాడు.
ప్రముఖ సినీనటుడు, ఏపీలోని హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంట్లో చోరీకి స్కెచ్‌ వేశాడు.

మరిన్ని వార్తలు