అన్నం పెట్టిన ఇంటికే కన్నం

9 May, 2019 07:54 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ భిక్షంరెడ్డి చోరీ జరిగింది ఈ ఇంట్లోనే..

హిమాయత్‌నగర్‌లో భారీ చోరీ

రూ.30 లక్షల విలువైన ఆభరణాలు

రూ.4 లక్షల నగదు అపహరణ

నిందితులు వాచ్‌మెన్‌లేనని పోలీసుల నిర్ధారణ

రంగంలోకి మూడు బృందాలు.. గాలింపు చర్యలు

హిమాయత్‌నగర్‌:నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించారు. దాదాపు రూ.30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదు అపహరించిన ఘటన హిమాయత్‌నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగింది.  బుధవారం ఉదయం డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్‌ టీంలతో సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించినట్లు అబిడ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ భిక్షంరెడ్డి, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ పాలేపల్లి రమేష్‌కుమార్, క్రైం ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌లు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు. 

పనిలో చేరిన నలభై రోజులకే..
హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నంబర్‌ 11లోని 3–6–685 ఇంట్లో గౌతం దుగర్, షీలా దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంట్లో  నలభైరోజుల క్రితం వాచ్‌మెన్‌లుగా నేపాల్‌కు చెందిన జనక్‌ బహుదూర్, హీరాలు పనికి కుదిరారు. వీరితోపాటు వంట మనిషిగా అజిత్‌కుమార్‌ పని చేస్తున్నాడు. జనక్‌ బహుదూర్, హీరాలు వాచ్‌మెన్‌లుగా ఉంటూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నెల 6న కోయంబత్తూర్‌లో జరిగిన జైన్‌ల ఉత్సవానికి గౌతం దుగర్, షీలా దంపతులు వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి జనక్‌ బహుదూర్, హీరాలు మరో ఇద్దరి సాయంతో బెడ్రూంలోకి చొరబడి బీరువా లాకర్‌లను తెరచి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, వజ్రాలతో పాటు రూ.4లక్షల నగదును తీసుకుని పరారైనట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏసీపీ భిక్షంరెడ్డి వెల్లడించారు. జనక్‌బహుదూర్, హీరాలు నుంచి కనిపించడం లేదని మరుసటి రోజు తమకు వంటమనిషి అజిత్‌కుమార్‌ సమాచారం ఇచ్చాడని, హుటాహుటీనా వచ్చి ఇంటిని చూసుకోగా..తాళాలు పగలగొట్టి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిసిందని ఇంటి యజమానులు పోలీసులకు తెలిపారు. గతంలో తమ వద్ద పని చేసిన వాళ్లే ఈ ఇద్దరినీ పనిలో పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు...
చోరీ జరిగిందని ఫిర్యాదు అందడంతో బుధవారం ఉదయం అబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌లు రమేష్‌కుమార్, రవికుమార్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆభరణాలు చోరీ చేసి ఇంటి వెనకభాగం నుంచి గోడ దూకి పరారైనట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇంట్లోని సీసీ కెమెరాల్లో ఆగంతుకుల ఆనవాళ్లు సరిగా కనిపించకపోవడంతో  సమీపంలోని ఇంకొన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు మూడు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ బృందం ఎంజీబీఎస్, జీబీఎస్, సిటీ బస్‌స్టేషన్లు, మరో బృందం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లతో పాటు నగరంలోని అన్ని రైల్వే స్టేషన్‌లలో తనిఖీలు చేపట్టాయి. దీంతో పాటు మెట్రో స్టేషన్లలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. మూడో బృందం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్‌ విభాగం వద్ద ఉన్న సీసీ కెమెరాలను ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.  

ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌..
ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి వాచ్‌మెన్‌ల ఫోన్‌లు, గతంలో వీరిని పనికి కుదిర్చిన వ్యక్తి ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ ఉన్నట్లు మొబైల్‌ సీడీఆర్‌లో వెల్లడైంది. చోరీ పక్కా ప్లాన్‌తోనే చేశారా అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడు, అతనికి ఇప్పుడు చోరీకి పాల్పడిన వారికేమైనా సంబంధాలున్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   

నేడో.. రేపో.. నేపాల్‌కు...
బుధవారం రాత్రి వరకు నగరమంతా జల్లెడ పట్టిన పోలీసులకు నిందితుల జాడ లభించలేదు. గతంలో గౌతం దుగర్, షీలా దంపతుల ఇంట్లో చేసిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఇంట్లో నలభై రోజుల క్రితం పని చేసి మానేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు  చర్యలు చేపట్టారు. అతని ద్వారా నిందితులు నేపాల్‌లో ఎక్కడ ఉంటారు, వారి పూర్తి వివరాలను సేకరించి గురువారం అక్కడికి వెళ్లేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.   

మరిన్ని వార్తలు