మడమనూరులో భారీ చోరీ

22 Jan, 2020 12:44 IST|Sakshi
బాధితురాలిని అడిగి వివరాలు తెలుసుకుంటున్న సీఐ రామకృష్ణారెడ్డి

65 సవర్ల బంగారు, రూ.30 వేల నగదు అపహరణ

నెల్లూరు, మనుబోలు: మడమనూరులో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోనికి ప్రవేశించి 65 సవర్ల బంగారు, రూ.30వేలు నగదు అపహరించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు..గ్రామానికి చెందిన కొండూరు విజయమ్మ భర్త వెంకటరమణారెడ్డి ఏడాది క్రితం మరణించారు. అప్పట్నుంచి మనమరాళ్లతో కలిసి ఒంటిరిగా నివాసం ఉంటోంది. సోమవారం సాయంత్రం విజయమ్మ ఇంటికి తాళం వేసి పారిచర్లవారిపాళెంలోని పుట్టింటికి వెళ్లింది. ఇదే అదునుగా దొంగలు కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులోని 65 సవర్ల బంగారు నగలు, రూ.30వేల నగదు అపహరించుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన విజయమ్మ ఇంటి తాళం తీసి చూడగా బీరువా తెరిచి ఉంది. బోరువాలో పరిశీలించగా బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. ఇంటిని పరిశీలించగా కిటికీ తొలగించి ఉండడంతో దొంగలు చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకుని  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీఐ రామకృష్ణారెడ్డి చోరీపై విజయమ్మను ఆరా తీశారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు