ముళ్ల పొదల్లో రూ.కోటి బంగారం స్వాధీనం

5 Jan, 2019 11:47 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్లు

తమిళనాడు, అన్నానగర్‌: పారైయారు సమీపంలో గురువారం ముళ్ల పొదల్లో దాచి ఉంచిన రూ.కోటి విలువైన బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్‌ఐతో సహా ముగ్గురు పోలీసులను అధికారులు శుక్రవారం ఆకస్మిక బదిలీ చేశారు. పుదుచ్చేరి జిల్లా కారైక్కాల్‌ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలకు పారైయారు మార్గంగా సారా, మద్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తుంటారు. దీన్ని అరికట్టేందుకు నండలారు ప్రాంతంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, ఆ మార్గంలో వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు.

అలాగే గురువారం పారైయారు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నటరాజన్‌ ఆధ్వర్యంలో నాగై జిల్లా మద్యం నిషేధ పోలీసులు చెక్‌పోస్టులో వాహన తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అక్కడున్న ముళ్లపొదల్లో ఓ బ్యాగ్‌ పడి ఉంది. పోలీసులు ఆ బ్యాగ్‌ను తీసి చూడగా అందులో 26 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిసింది. వీటి బరువు 3,075 గ్రాములు. దీని విలువ రూ.కోటి ఉంటుందని తెలిసింది. అనంతరం బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఎస్‌ఐతో సహా ముగ్గురు పోలీసులు బంగారాన్ని ముళ్ల పొదల్లో దాచినట్టు  తెలిసింది. దీంతో శుక్రవారం ఎస్పీ విజయకుమార్‌ ఉత్తర్వుల మేరకు ఎస్‌ఐ సహా ముగ్గురు పోలీసులను సాయుధ ధళానికి ఆకస్మిక బదిలీ చేశారు.

మరిన్ని వార్తలు