రూ. 7లక్షల నగదుకు అరకిలో బంగారు నాణేలు

25 Oct, 2019 13:12 IST|Sakshi
మోసగాళ్లు అంటగట్టిన నకిలీ బంగారు నాణేలు 

సాక్షి, కర్నూలు (ఆత్మకూరు): తక్కువ ధరకే బంగారం ఇస్తామని దుండగుల ఆశ చూపగా.. వెనుకా ముందు చూడకుండా రూ.7 లక్షలు సమర్పించుకున్నాడో అమాయకుడు. ఆత్మకూరు పట్టణానికి చెందిన జోషిబాబు బళ్లారికి చెందిన కొందరు తనకు నకిలీ బంగారం అంటగట్టి రూ.7లక్షలు కాజేశారని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. ఆత్మకూరు పట్టణానికి చెందిన జోషిబాబు తనకు తెలిసిన వారి వల్ల కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. తమ వద్ద  పురాతన బంగారు నాణేలున్నాయని, వాటిని సొమ్ము చేసుకోవడం కష్టంగా ఉన్నందు వల్ల తెలిసిన వారికి విక్రయిస్తున్నామని నమ్మ బలికారు.

మార్కెట్‌లో బంగారం ధర తులం రూ.39 వేలు పైగానే పలుకుతుండగా అందులో సగం ధరకే బంగారు అమ్ముతామనడంతో జోషిబాబు ఆశ పడ్డాడు. పరిశీలించుకోమని శాంపిల్‌గా రెండు నాణేలు ఇచ్చారు. అవి నిజమైనవి కావడంతో మిగతా నాణేలు పరిశీలించుకోకుండా ఈనెల 18న రూ.7 లక్షల నగదును బళ్లారికి చెందిన అజ్ఞాత వ్యక్తులకు ఇచ్చి వారి నుంచి అరకేజీ నాణేలు తీసుకున్నాడు. కాగా ఇటీవల కొందరు నకిలీ బంగారాన్ని అంటగట్టి మోసం చేస్తున్నారనే వార్తలను దినపత్రికల్లో చేసిన జోషిబాబు అనుమానంతో తన వద్ద ఉన్న బంగారు నాణేలను షరాబుతో పరీక్షించగా నకిలీవని తేలింది. దీంతో లబోదిబోమంటూ ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ ఓబులేసు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు