గొబ్బూరులో భారీ చోరీ

21 Mar, 2018 11:27 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న అనకాపల్లి సీఐ రామచంద్రరావు

రూ.పది లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువుల అపహరణ

కశింకోట(అనకాపల్లి):మండలంలోని గొబ్బూరు గ్రామంలో రూ.పది లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును దొంగలు అపహరించుకుపోయారు.  ఎవరూ లేని సమయాన్ని గమనించిన దొంగలు సోమవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.  ఇందుకు సంబంధించి బాధితుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సూర్యారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యారావు భార్య నూతన కుమారి  అనారోగ్యానికి గురవడంతో  విశాఖపట్నంలోని తన కుమార్తె వద్ద ఉంటూ ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. దీంతో గొబ్బూరులో ఉన్న ఇంట్లో ఎవరూ లేరు.  సూర్యారావు తండ్రి కాశీరావు కూడా ఎదురుగా ఉన్న మరో ఇంట్లో ఉం టున్నారు.  సోమవారం రాత్రి దొంగలు సూర్యారావు ఇంటి ముఖ ద్వారం తలుపు గడియను రాడ్‌తో పెకిలించి, లోపలికి ప్రవేశించారు.    పూజ గదిలో ఉన్న రెండు బీరువాలను తెరచారు. సేఫ్‌ లాకర్లలో ఉంచిన సుమారు 28 తులాల గొలుసుల హారం, కాసుల పేరు తదితర ఆభరణాలు, వంద తులాల వెండి సామగ్రి, రూ.50 వేల నగదు దోచుకుపోయారు.   పడకగదిలో ఉన్న హుండీని పగులగొట్టి వాటిలో కొన్ని నాణేలను ఓ స్టీల్‌ గ్లాసులో వేసుకుని పట్టుకుపోయారు.

కొన్ని నాణేలను పటుకెళ్లలేక అక్కడ వంట గదిలో విడిచిపెట్టారు. దొంగలు వెనుక ద్వారం నుంచి పొలాల గుండా వెళ్లిపోయారు. ఉదయం తండ్రి కాశీరావు ఇంటికి వచ్చాడు.  తలుపులు తెరచి ఉండటాన్ని గమనించి పరిశీలించగా దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  సంఘటన స్థలాన్ని అనకాపల్లి డీఎస్పీ కె.వెంకటరమణ,  సీఐ జి.రామచంద్రరావు సందర్శించి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ విభాగం   దొంగల వేలి ముద్రలు సేకరించింది. సంఘటన జరిగిన తీరు గమనిస్తే బాగా తెలిసిన స్థానిక దొంగలే దోపిడికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.  రెండేళ్ల క్రితం కూడా ఇదే గ్రామంలో పక్క వీధిలో ఒకే రోజు మళ్ల రామారావు, మళ్ల రామకృష్ణ భాస్కరరావులకు చెందిన    ఇళ్లలో దొంగలు చొరబడి సు మారు 15 తులాల బంగారు నగలు అపహరిం చారు. ఇంకా ఆ కేసులో దొంగలను పట్టుకోకముందే తాజాగా మరో దొంగతనం జరిగింది.  గట్టి నిఘాను ఏర్పాటు దొంగతనాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు