జాకెట్‌లో బంగారం!

4 Sep, 2018 09:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై విమానాశ్రయంలో ఇద్దరి అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: స్త్రీలు ధరించే జాకెట్లలో బంగారం దాచి, కనిపించకుండా ఎంబ్రాయిడరీ చేసి అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తితో పాటు, అతనికి స్వాగతం పలికేందుకు వచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.

చెన్నైకి చెందిన ఆయుబ్‌ ఖాన్‌ (32) కువైట్‌ నుంచి ఓమన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో సోమవారం చెన్నై విమానాశ్రయం చేరుకున్నాడు. అతను గ్రీన్‌ చానల్‌ మార్గంలో బయటకు వెళ్తున్నాడు. అతనికి స్వాగతం తెలిపేందుకు ముస్తఫా (27) అనే వ్యక్తి వేచి ఉన్నాడు. కస్టమ్స్‌ అధికారులు ఆయుబ్‌ ఖాన్‌ను మళ్లీ లోపలికి పిలువగా.. లోపలికి వెళ్లడానికి నిరాకరించడమే కాకుండా, తనిఖీలు ముగించుకునే కదా బయటకు వచ్చానని అధికారులతో వాగ్వాదం చేశాడు. దీంతో అతనిపై అనుమానంతో మళ్లీ తనిఖీ చేశారు.

అతని సూట్‌కేస్‌లో మహిళలు ధరించే మూడు జాకెట్లు ఉన్నాయి. వాటికున్న ఎంబ్రాయిడరీ డిజైన్‌లను అధికారులు తొలగించి చూడగా చిన్న చిన్న ముక్కలుగా బంగారం దొరికింది. అలాగే ఓ వంట పాత్ర వస్తువు పేరుతో ఉన్న ప్యాకెట్‌లో బంగారు కమ్మీలు దొరిగాయి. సుమారు 11 బంగారు ముక్కలుగా, రూ.15 లక్షల విలువైన 500 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుబ్‌ ఖాన్, ముస్తఫాలను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు