పట్టపగలే దొంగల బీభత్సం

2 Oct, 2018 09:14 IST|Sakshi
సంఘటనను వివరిస్తున్న బాధితులు

ఇద్దరు మహిళల్ని బంధించిన ఐదుగురు దుండగులు

ఇరువురి ఒంటిపై ఉన్నబంగారు ఆభరణాలు దోపిడీ

అల్మారాలోని ‘చోర్‌ ఖానా’లో దాచడంతో మరిన్ని సేఫ్‌

ఘటనాస్థలిని పరిశీలించిన నగర పోలీసు కమిషనర్‌

తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు మహిళల్ని బంధించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఉదయం 10.30  గంటల సమయంలో ఐదుగురు దొంగలు దర్జాగా ఇంటి గేటు తీసుకుని లోపలికి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వీరిలో ఒక మహిళ ఉందని బాధితులు తెలిపారు. ఐదు తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సాక్షి, సిటీబ్యూరో/రసూల్‌పురా: రాజధానిలో పట్టపగలు బందిపోటు దొంగతనం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు అత్తాకోడళ్లను బంధించి వారి ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలను దోచుకున్నారు. మరికొంత పసిడి, డబ్బు అల్మారాలోని ‘చోర్‌ ఖానా’లో ఉండటంతో వీరి కంట పడలేదు. ఉత్తర మండలంలోని తిరుమలగిరి ఠాణా పరిధిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి వచ్చిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పట్టపగలు చోటు చేసుకున్న ఈ ఉదంతం నగరంలో కలకలం సృష్టించింది. కార్వాన్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పని చేస్తున్న షానవాజ్‌ తిరుమలగిరి దర్గా సమీపంలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతను ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు డ్యూటీకి బయలుదేరి వెళతాడు. సోమవారం కూడా యధావిధిగా డ్యూటీకి వెళ్లిపోగా, అతని భార్య, తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు.

వీరు ఇంటి ముందు ఉన్న గేట్‌కు గొళ్లెం పెట్టి తలుపులు తెరిచి ఉంచారు. ఉదయం 10.30  గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేట్‌ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరు అంటూ అత్తాకోడళ్లు ప్రశ్నిస్తుండగానే లోపలికి దూసుకువచ్చిన వీరు వారిని అక్కడే ఉన్న వస్త్రాలతో కట్టేపడేసి, ఇద్దరి నోటికి సెల్లో టేప్‌ వేశారు. అనంతరం ఇద్దరి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారు నగదు, 45 తులాల వెండి పట్టీలు తీసుకున్నారు. గదిలోకి వెళ్లిన ఆగంతకులు అల్మారాను తెరిచి ఆద్యంతం వెతికారు. అయితే భారీ మొత్తంలో బంగారం, రూ.1.5 లక్షల నగదును షానవాజ్‌ తన అల్మారాలోని ‘చోర్‌ ఖానా’లో ఉంచడంతో వీరి కంట పడలేదు. (అల్మారాలు, బీరువాల్లో ఇతరులకు కనిపించని రహస్య అరలు, భాగాలను చోర్‌ ఖానాలుగా) పిలుస్తారు. అరగంటలో తమపని పూర్తి చేసుకున్న దండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన అత్తాకోడళ్లు ఇరుగుపొరుగు వారిని ఆశ్రయించడంతో వారు కట్లు విప్పారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నారని, వీరిలో బుర్ఖా ధరించిన ఓ మహిళ కూడా ఉన్నట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగవనర్‌ సందర్శించారు. ఈ వ్యవహారంలో తెలిసిన వారి ప్రమేయాన్నీ అనుమానిస్తున్నారు. ఈ బందిపోటు దొంగలను పట్టుకోవడానికి శాంతిభద్రతల విభాగంతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. షానవాజ్‌ ఇంటి నుంచి ప్రధాన రహదారి వరకు, అక్కడ నుంచి వివిధ మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్తున్నారు.  

దోచేసింది రా‘బంధువులే’..?
షానవాజ్‌ ఇంట్లో బందిపోటు దొంగతనానికి ఒడిగట్టింది బంధువులే నని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురిలో నలుగురు పురుషులు ముసుగులు ధరించి ఉండటం, మహిళ బుర్ఖాలో ఉండటంతో బాధితులు వీరిని గుర్తించలేదు. మరోపక్క నేరం చేస్తున్న సమయంలో వీరు గొంతులు మార్చి మాట్లాడారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితురాలు బుర్ఖా ధరించడం, వారు వినియోగించిన పదజాలాన్ని పరిగణలోకి తీసుకుని ప్రాథమికంగా బాధితులు, నిందితులు ఒకే వర్గానికి చెందిన వారుగా అంచనా వేశారు. వీరిందరూ కలిసే వచ్చి ఉంటారని భావించారు. ఇందుకు ఆటో లేదా కారు వాడి ఉండవచ్చునని అనుమానించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించి ఓ అనుమానాస్పద కారును గుర్తించారు. దాని నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే షానవాజ్‌ బంధువులు కక్షగట్టి ఈ బందిపోటు దొంగతనానికి ఒడిగట్టినట్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. పరారీలో ఉన్న మరికొందరికోసం గాలిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు