-

పగలు రెక్కీ.. రాత్రి చోరీ

18 Jun, 2019 08:19 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు నిందితుడు బాలరాజు

ఘరానా దొంగ అరెస్ట్‌

15 తులాల బంగారం, 12.5 తులాల వెండి

ఆభరణాలు స్వాధీనం

గచ్చిబౌలి: బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లకు గుర్తించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలు వెల్లడించారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆలకుంట బాలరాజు అలియాస్‌ బాలు క్రేన్‌ వర్కర్‌గా పనిచేస్తూ కార్వాన్‌లో ఉంటున్నాడు. గత కొంతకాలంగా అతను ఉదయం పూట బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో  చోరీలకు పాల్పడుతున్నాడు. నార్సింగి, రాజేంద్రనగర్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్‌  పోలీస్‌ స్టేషన్ల  పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాదాపు 135 సీసీ కెమెరాల్లో రికార్డైన పుటేజీని పరిశీలించారు.

ఈ సందర్భంగా అనుమాస్పదంగా కనిపించిన బజాజ్‌ డిస్కవరీ బైక్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 2011 మోడల్‌కు చెందిన సదరు బైక్‌ 12 మంది చేతులు మారినట్లు తెలసుకున్నారు. చివరకు బాలరాజు అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా గుర్తించిన పోలీసులు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.  నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి నుంచి 15 తులాల బంగారు నగలు, 12.5 తులాల వెండి, బైక్, టీవీ, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో  మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, నార్సింగి సీఐ రమణగౌడ్, ఎస్‌ఐ దేవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు