ఐదు సవర్ల బంగారం చోరీ

12 Mar, 2019 12:21 IST|Sakshi
మంచంపై చిందర వందరగా ఉన్న వస్తువులు

ఒకటిన్నర కేజీ వెండి కూడా..

ప్రకాశం,కనిగిరి: పట్టణంలోని 8వ వార్డు బాదుల్లా వారి వీధిలో విశ్రాంత ఉద్యోగి ఎస్‌కే ఖాజామొహిద్దీన్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. బంధువుల కథనం ప్రకారం.. విశ్రాంత వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజామొహిద్దీన్‌ సుమారు 3 నెలల క్రితం (జమాత్‌కు) బయటకు వెళ్లాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉద్యోగ రీత్యా హైదరాబాద్, వైజాగ్‌లో ఉంటున్నారు. ఆయన భార్య ఖాజాబీ మాత్రమే ఇంట్లో ఉంటోంది. 15 రోజుల క్రితం ఖాజాబీ కూడా చిన్న కుమారుడు వద్దకు (హైదరాబాద్‌) వెళ్లింది. ఆమె చెల్లెలు అప్పుడప్పుడూ వచ్చి ఇంట్లోని చెట్లకు నీరు పోస్తుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి డోర్లు తెరిచి ఉన్నాయి.

వెంటనే బంధువులు, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు. దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఇంటి బయట తాళం పగులగొట్టి ప్రధాన గేటు తాళం తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఇంట్లో బీరువా తాళం, లాకర్‌ పగులకొట్టి అందులోని చిన్న పిల్లల పట్టీలు, కాడలు, పెద్ద పట్టీలు మొత్తం సుమారు 10 జతల వెండి వస్తులు (సుమారు ఒకటిన్నర కేజీ), చిన్న పిల్లల ఉంగరాలు 12, చెవి కమ్మలు, చిన్న చైను వగైరా వస్తువులు 5 సవర్ల బంగారు అభరణాలు అపహరించుకెళ్లారు. పక్కనే ఉన్న సెల్ఫ్‌లు తెరిచి అందులోని చీరలు ఇతర దుస్తులు అపహరించుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. సీఐ జి. సంగమేశ్వరరావు తన సిబ్బందిలో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బంధువులు, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఒంగోలు నుంచి క్లూస్‌ టీమ్‌ వచ్చి ఆధారాలు సేకరించింది.

మరిన్ని వార్తలు