కాసులకు కక్కుర్తి పడి...

30 Nov, 2018 08:21 IST|Sakshi
బొబ్బిలి దుకాణ సముదాయాలు

దొంగ బంగారం కొంటున్న వ్యాపారులు

అంతర్రాష్ట్ర నేరగాడి నుంచి 1.20 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు

బొబ్బిలిలో ఇద్దరు వ్యాపారస్థులు, మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

విజయనగరం, బొబ్బిలి: నకిలీ నోట్లు, నిషేధిత బాణసంచా వ్యాపారం, రియల్టర్ల హత్యాయత్నాలు, గన్‌ కల్చర్‌తో చెడ్డ పేరు సంపాదించుకున్న బొబ్బిలికి తాజాగా మరో మరక అంటింది. డబ్బులకు ఆశపడి కొంతమంది ప్రముఖులే దొంగల నుంచి బంగారం కొంటున్నారు. ఈ విషయాన్ని విశాఖ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన అంతర్రాష్ట్ర నేరగాడు దున్న కృష్ణ విశాఖలో బంగారాన్ని దొంగతనం చేశారు. ఈ బంగారాన్ని బొబ్బిలి మెయిన్‌రోడ్డులో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న యజమాని ద్వారా ఇద్దరు ప్రముఖ వ్యాపారులకు విక్రయించాడు. వస్త్ర వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి 750 గ్రాములు...  ఇటీవలే బలిజిపేట రోడ్డులో బంగారు నగల దుకాణం పెట్టిన ఓ యువ వ్యాపారి 450 గ్రాముల బంగారం కొనుగోలు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి చెప్పుల దుకాణ యజమాని ఈ బంగారాన్ని వ్యాపారులకు విక్రయించాడు.

తులం రూ.36 వేలున్న బంగారం చవగ్గా వస్తుండడంతో బంగారం తెచ్చిన వారికి అంత స్థాయి ఉందా లేదానన్న విషయం చూడకుండా వ్యాపారులు కొనుగోలు చేసేశారు. వాస్తవానికి ఇద్దరికీ ఆ స్థాయి వ్యాపారాలు లేనప్పటికీ తక్కువకు వస్తుందన్న దురాశతో బంగారం కొన్నారు. అయితే ఈ విషయం విశాఖ కమిషనర్‌కు తెలియడంతో సిబ్బందిని మఫ్టీలో బొబ్బిలి పంపించి వ్యాపారులను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యాపారులతో పాటు విక్రయించిన మరో ఇద్దరు ప్రస్తుతం విశాఖ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అయితే బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు వారిని ఇంకా విడిచిపెట్టలేదని సమాచారం. కొనుగోలు చేసిన బంగారం విలువ ఇంకా ఎక్కువ ఉందా లేదానన్న విషయంలో విశాఖ సీపీ సిబ్బంది వాకబు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఈ ముఠా విషయమై బొబ్బిలి పోలీసులు ఆరా తీసినా ఇతరత్రా పనులతో ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి ఇంటరాగేషన్‌ చేసేవరకూ ఇక్కడి పోలీసులకు తెలియని పరిస్థితి నెలకొందంటే స్థానిక పోలీసుల పనితీరుపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా దొంగ బంగారం కొనుగోలులో నలుగురు అరెస్ట్‌ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే బంగారాన్ని అమ్మజూపిన వారు కూడా పాత నేరస్తులేనని సమాచారం. గతంలో నగల దుకాణం యజమాని నుంచి పార్వతీపురానికి సంబంధించిన ఓ దొంగతనం కేసులో బంగారాన్ని కూడా రికవరీ చేయించినట్టు తెలిసింది.

విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
దొంగ బంగారం కొనుగోలు కేసులో పట్టణానికి చెందిన వారిని విశాఖ సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నట్లుంది. పూర్తి వివరాలు కూడా వారికే తెలుస్తాయి.– దాడి మోహనరావు, సీఐ బొబ్బిలి

మరిన్ని వార్తలు