నమ్మితే నట్టేట ముంచాడు

24 Apr, 2018 12:16 IST|Sakshi
మూసి ఉంచిన భూపాల్‌ దుకాణం , భూపాల్‌ మన్నా, పోలీస్‌ స్టేషన్‌కు తరలి వచ్చిన బాధితులు

ఉడాయించిన నగల వ్యాపారి,కిలోన్నర బంగారంతో పరార్‌

ఆందోళనలో వ్యాపారులు, కస్టమర్లు

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

పెర్కిట్‌(ఆర్మూర్‌): సుమారు 20ఏళ్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నగల తయారీ కోసం ఆర్డరు ఇచ్చిన బంగారంతో రాత్రికే రాత్రి బిచాన ఎత్తేశాడు ఆర్మూర్‌లో స్థిర పడ్డ భూపాల్‌ మన్నా అనే నగల తయారీదారుడు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన భూపాల్‌ మన్నా 20ఏళ్ల క్రితం ఆర్మూర్‌కు కుటుంబంతో వలస వచ్చాడు. అనంతరం ఇక్కడి బంగారు వర్తకులు, సామాన్య ప్రజల విశ్వాసం పొందుతూ నగల తయారీ వ్యాపారం చేపట్టాడు. ఆర్మూర్‌ ప్రాంతంతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సైతం తన వ్యాపారాన్ని విస్తరించాడు.

ఏజెంట్లను నియమిస్తూ వ్యాపారులు, సామాన్యుల నుంచి బంగారు నగల ఆర్డర్లు తీసుకునేవాడు. ఈ క్రమంలో భూపాల్‌ మన్నా ఆదివారం రాత్రికి రాత్రే సుమారు రూ.41 లక్షల 60 వేల విలువ గల కిలోన్నర బంగారంతో ఉడాయించాడు. సోమవారం ఆర్డరు ఇచ్చిన నగలను తీసుకెళ్లడానికి వచ్చిన వ్యాపారులకు భాపాల్‌ దుకాణం మూసి ఉంది. దీంతో ఫోన్‌ చేసి చూడగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. 

వారం క్రితం నుంచే ప్రణాళిక
భూపాల్‌ మన్నా బంగారంతో ఉడాయించేందుకు వారం క్రితం నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం క్రితమే భార్యను ఆర్మూర్‌ నుంచి పంపిచేశాడు. తన వద్ద ఉన్న 15 మంది నగల తయారీదారులు సైతం ఆదివారం నుంచి కనిపించడం లేదని స్థానికుల సమాచారం. ఈ వ్యాపారంలో భూపాల్‌ మన్నా బాగానే గడించాడని వ్యాపారంతో సంబంధమున్నవారు తెలిపారు. ఇళ్లల స్థలాలతో పాటు ఇటీవలే నూతనంగా ఒక ఇంటిని ఖరీదు చేసినట్లు సమాచారం. ఈజీ మనీ ఆశలో భూపాల్‌ అప్పుల పాలైనట్లు సమాచారం. తక్కువ ధరకే బంగారం వచ్చే పలు స్కీముల ఉచ్చులో పడి అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఆర్మూర్‌ ప్రాంతవాసుల వద్ద వేసిన చీటీలకు సైతం ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఒకరొకరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో రెండు కిలోల వరకు బంగారాన్ని భూపాల్‌ తనతో తీసుకెళ్లి ఉంటాడని వ్యాపారవర్గాల సమాచారం.

కూతురు పెళ్లి కోసం..
తన కూతరితో పాటు, బావ మరిది కూతరు వివాహానికి అవసరమయ్యే నగల కోసం 400 గ్రాముల బంగారాన్ని భూపాల్‌ మన్నాకు ఇచ్చాం. ఈరోజు నగలను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తీరా దుకాణానికి వచ్చే సరికి మూసి ఉంది. నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు. –లింగన్న, నిర్మల్‌

న్యాయం చేయాలి...
నగల తయారీ కోసం భూపాల్‌ మన్నాకు 40 తులాల బంగారాన్ని ఇచ్చాం. బంగారం తీసుకుని ఉడాయిస్తాడని అనుకోలేదు. నమ్మక ద్రోహం చేసి భూపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలి.
–వెంకటేశ్, డీకంపల్లి, నందిపేట

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా