‘గోల్డ్‌’ ప్యాక్‌

15 Apr, 2019 08:22 IST|Sakshi

పేస్ట్‌గా మార్చి.. లోదుస్తుల్లో దాచి..   

దోహా నుంచి బంగారం తీసుకొచ్చిన క్యారియర్‌  

పట్టుకున్న ‘శంషాబాద్‌’ కస్టమ్స్‌ అధికారులు

1164.9 గ్రా.  బంగారం స్వాధీనం  

విలువ రూ.36.99 లక్షలు  

సాక్షి, సిటీబ్యూరో: స్మగ్లర్లు పసిడి అక్రమ రవాణాకు వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. బంగారాన్ని వివిధ రూపాలుగా మార్చి అధికారులను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శంషాబాద్‌అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు వరుసగా పట్టుకుంటున్న కేసులతో ఈ విషయం  అర్థమవుతోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా ‘గోల్డ్‌ పేస్ట్‌’ స్మగ్లింగ్‌ పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం దోహా నుంచి వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రూ.36.99 లక్షల విలువైన 1164.9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతుండగా... ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం రూ.33 వేల వరకు ఉంది. అదే ఖతర్, దుబాయ్‌ తదితర దేశాల్లో రూ.26వేలకే లభిస్తోంది. దీంతో బంగారం అక్రమ రవాణా చేస్తే ఒక్కో ట్రిప్‌లో కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల లాభం ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అనేక మంది కీలక సూత్రధారులు క్యారియర్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తున్నారు.

తెచ్చాడిలా...  
కేరళకు చెందిన ఓ వ్యక్తిని అక్కడి కీలక సూత్రధారులు క్యారియర్‌గా మార్చుకున్నారు. కమీషన్‌ లేదా విమానం టికెట్లు ఇస్తూ తాము అందించే బంగారాన్ని భారత్‌కు చేర్చే బాధ్యతలు నిర్వర్తించే వారిని క్యారియర్లుగా పిలుస్తారు. వీరికి సూత్రధారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. కేవలం దళారుల సూచనల మేరకు ఈ అక్రమ రవాణా చేస్తుంటారు. వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం ఎవరికి ఇవ్వాలనేది చెప్పరు. కేవలం క్యారియర్లను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి ఫలానా చోట ఉండమంటారు. వీరి ఫొటోలను దళారులు వాట్సాప్‌ ద్వారా ఇక్కడి రిసీవర్లకు పంపుతారు. దీంతో వీరిని గుర్తించే రిసీవర్లు బంగారం తీసుకొని టిప్స్‌ ఇస్తుంటారు. కేజీకి పైగా బంగారం ఖరీదు చేసిన స్మగ్లర్లు దోహాలో ఉన్న కొన్ని ప్రత్యేక దుకాణాలకు అందించారు.

దాన్న పౌడర్‌గా ఆపై పేస్ట్‌గా మార్చిన ఆ దుకాణదారులు ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి అందించారు. దీన్ని ఓ ప్రత్యేకమైన వస్త్ర సంచిలో ఉంచిన కేరళవాసి లోదుస్తుల్లో దాచుకొని తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం ఇండిగో విమానంలో శంషాబాద్‌కు వచ్చిన ఇతగాడు ‘గ్రీన్‌ చానెల్‌’ ద్వారా బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరి వద్ద అయితే ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉండవో వారు ఈ చానెల్‌లో బయటకు వెళ్లిపోతారు. అలాంటి వస్తువులు, బంగారం తీసుకొచ్చిన వాళ్లు రెడ్‌ చానెల్‌లోకి వెళ్లి ఆయా వస్తువుల్ని డిక్లేర్‌ చేయడంతో పాటు పన్ను చెల్లించి వస్తారు. గ్రీన్‌ చానెల్‌లో బయటకు వస్తున్న కేరళ వాసి వ్యవహారాన్ని శంషాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు అనుమానించారు. ఆపి తనిఖీ చేయగా లోదుస్తుల్లో దాచిన సంచిలో ఉన్న 1900 గ్రాముల పేస్ట్‌ దొరికింది. దీన్ని ప్రాసెసింగ్‌ చేసిన అధికారులు 1164.9 గ్రాముల బంగారంగా మార్చారు. ఇతడు ఎవరి కోసం ఈ బంగారం తీసుకొచ్చాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? తదితర అంశాలను కస్టమ్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు