బ్యాటరీ ‘విప్పి’ చూడ బంగారముండు!

28 Apr, 2018 01:07 IST|Sakshi
బ్యాటరీల నుంచి బయటికి తీసిన బంగారం రేకులు

     ఎల్‌ఈడీ బ్యాటరీల్లో దాచి గోల్డ్‌ స్మగ్లింగ్‌  

     రూ.14 లక్షల విలువైన పసిడి స్వాధీనం 

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేసే ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఎల్‌ఈడీ లైట్‌ బ్యాటరీల లోపలి భాగంలో బంగారం ప్లేట్లను అమర్చి, స్కానింగ్‌కు సైతం చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్మగ్లింగ్‌ చేస్తున్నాయి. ఈ పంథాలో ఎనిమిది పసిడి రేకుల్ని తీసుకువచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి రూ.14 లక్షల విలువైన 445 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు.

దుబాయ్‌కు చెందిన ఓ ముఠా బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు తాజాగా ఎంచుకున్న మార్గమే ఎల్‌ఈడీ బ్యాటరీ. బంగారాన్ని స్మగ్లర్లు మందమైన రేకులుగా మార్చారు. దీన్ని రీ–చార్జబుల్‌ లాంతర్‌ లైట్‌ లోపల ఉండే బ్యాటరీల్లో అమర్చారు. ఆ లైట్‌ను స్కానింగ్‌ చేసినా పసిడి ఆచూకీ దొరక్కుండా బంగారు రేకుల చుట్టూ నల్లరంగు పొడి ఏర్పాటు చేశారు. ఈ లైట్‌ను గురువారం దుబాయ్‌ విమానాశ్రయానికి తీసుకువచ్చిన స్మగ్లర్లు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అప్పగించారు. అతడికి ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ లైట్‌ను తీసుకుని హైదరాబాద్‌ వెళ్లాలని, అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని పంపారు. దీనికి ప్రతిఫలంగా కొంత మొత్తం చెల్లించారు. 

బండారం బయటపడిందిలా: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఈ క్యారియర్‌ గురువారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అనుమానాస్పదంగా ఉన్న అతన్ని కస్టమ్స్‌ అధీనంలోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్‌లో ఉన్న ఎల్‌ఈడీ లైట్‌ను పరిశీలించగా.. బ్యాటరీల తీరులో మార్పులు కనిపించాయి. వాటిని పగులగొట్టి చూడగా.. లోపల నల్లటి పొడితో కప్పి ఉంచిన బంగారం రేకులు బయటపడ్డాయి. క్యారియర్‌ను విచారించగా తనకు దాన్ని ఇచ్చిన వారితో పాటు తీసుకునే వారి వివరాలు సైతం తెలియవన్నాడు. అయితే దీని వెనుక పెద్ద రాకెట్‌ ఉండి ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు.   

మరిన్ని వార్తలు