బొమ్మ కారులో బంగారం! 

25 Mar, 2019 01:42 IST|Sakshi
కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం. చిత్రంలో బొమ్మ కారు

అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు 

పేస్ట్‌ రూపంలో తెచ్చిన ఇంకో స్మగ్లర్‌ 

ఇద్దరినీ పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

మొత్తం 724 గ్రాముల పసిడి స్వాధీనం 

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు దాన్ని వివిధ రూపాల్లో తీసుకువస్తున్నారు. శనివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరిని పట్టుకున్న శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారులు వారి నుంచి 724.29 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనతో పాటు ఓ బొమ్మ కారు తీసుకువచ్చాడు. అతన్ని స్కాన్‌ చేసిన అధికారులు అనుమానిత వస్తువులు లేకపోవడంతో పంపేశారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఇతడు తన లగేజ్‌లో ఉన్న బొమ్మ కారును బయటకు తీసి ఎదురు చూస్తున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడున్న శాంతిభద్రతల విభాగం పోలీసుల సాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ బొమ్మకారును తని ఖీ చేయగా అందులో ఉండే ట్రాన్స్‌ఫార్మర్‌ అనుమానాస్పదంగా కనిపించింది. అందులో ఉండే ఇనుప ప్లేట్లను పసిడి వాటితో రీప్లేస్‌ చేయడంతో పాటు ఎవరూ గుర్తించకుండా ఐరన్‌ కోటింగ్‌ వేసినట్లు గుర్తించారు. వాటిని వెలికి తీయగా 348.94 గ్రాముల బంగారం బయటపడింది. దీన్ని తీసుకోవడానికి వచ్చిన అతడిని కూడా అధికారులు పట్టుకున్నారు. అలాగే దుబాయ్‌ నుంచి వచ్చిన నరియల్‌ వాలా అనే వ్యక్తి తనతో పాటు పేస్ట్‌ రూపంలో ఉన్న పసిడిని తీసుకువచ్చాడు. లోదుస్తుల్లో దాచి తెస్తున్న దీన్ని గుర్తించిన అధికారులు పట్టుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న పేస్ట్‌ను ప్రాసెస్‌ చేయగా 375.35 గ్రాముల బంగారం వచ్చింది. పేస్టు రూప ంలో ఉన్న ఈ బంగారాన్ని ముంబై తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు.  

మరిన్ని వార్తలు