చీరల ఆశచూపి.. నగలతో ఉడాయించారు

1 Oct, 2018 13:28 IST|Sakshi
మోసగాళ్లు ఇచ్చిన చీరలతో విశ్వనాధ

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాయచోటి టౌన్‌ : బంగారు చీరల పేరుతో ఓ యువకుడిని మోసగించి అతని వద్ద ఉన్న బంగారు నగలతో ఉడాయించిన ఘరానా మోసగాళ్ల ఉదంతమిది. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన టి. సుండుపల్లెకు చెందిన విశ్వనాథ అనే యువకుడు రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లె సమీపంలో నెల రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి కానుకలలో భాగంగా అతనికి నాలుగు ఉంగరాలు, ఒక చైన్‌ ఇచ్చారు. వాటిని ధరించి ఆదివారం తన భార్య పుట్టింట్లో ఉండటంతో అత్తగారింటికి వెళ్లడానికి రాయచోటికి చేరుకున్నాడు. రాయచోటి డైట్‌ స్కూల్‌ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొనే సమయంలో ముగ్గురు వ్యక్తులు దగ్గరకు వచ్చి తెలిసిన వారిలాగా పరిచయం చేసుకున్నారు. భుజంపై చేతులు వేశారు. మాటా మాటా కలిపారు. నడుచుకొంటూ ప్రభుత్వ ఆస్పత్రి వెనుక వైపు వెళ్లారు. అక్కడ వీరికి సంబంధించిన మరో వ్యక్తి వచ్చి రెండు చీరెలు చూపెట్టాడు.

వారిలో మరో వ్యక్తి ఈ చీరలు బంగారుతో నేసినవిలా ఉన్నాయే అన్నాడు. అవును ఇవి బంగారుతో తయారు చేసినవే వీటి విలువ ఒక్కొక్కటి రూ.లక్ష అవుతుందని చెప్పాడు. ఈ రెండు చీరలను ఎవరికైనా రూ.లక్షకు అయినా అమ్మేస్తానని చెప్పాడు. దీంతో వారిలో మొదటి వ్యక్తి తన వద్ద రూ.10 వేలు ఉన్నాయి. మిగిలిన డబ్బులు తరువాత ఇస్తానని చెప్పాడు. అలా కుదరదు మొత్తం డబ్బులు ఇచ్చిన తరువాతే ఇస్తానని చీరలు తెచ్చిన వ్యక్తి అన్నాడు. ఇంతలో విశ్వనాధ వైపు చూసి నీ వద్ద బంగారు ఆభరణాలు ఉన్నాయి కదా వాటిని ఇస్తే ఈ రెండు చీరలు నీకు ఇస్తానని చెప్పాడు. అక్కడున్న వారి  మాటలు నమ్మిన విశ్వనాథ వెంటనే తన చేతులలోని నాలుగు ఉంగరాలు, ఒక చైను మొత్తం సుమారు 40 గ్రాములు వారి ఇచ్చేశాడు. వారు కూడా అతనికి రెండు చీరలు ఇచ్చి వీటిని ఎవరికీ చూపొద్దని చెప్పి పంపించేశారు. వాటికి ఇంటికి తీసుకెళ్లి భార్యకు చూపించగా ఇవి కేవలం రూ.1000కు మించి ఖరీదు కావని చెప్పడంతో తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబో మంటూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు