తండ్రీకూతుళ్లను కలిపిన గూగుల్‌

18 Aug, 2019 16:30 IST|Sakshi

గూగుల్‌ మ్యాప్స్‌ మతిస్థిమితం లేని బాలికను తండ్రి చెంతకు చేర్చింది. ఈ యాప్‌ సహాయంతో పోలీసులు బాలిక తల్లిదండ్రుల జాడను కనుక్కోగలిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కృతినగర్‌లో మార్చి 31న ఓ బాలిక రిక్షా ఎక్కింది. ఎక్కడకు వెళ్లాలని అడిగిన రిక్షా డ్రైవర్‌ ప్రశ్నకు ఏమీ బదులివ్వకుండా బిత్తర చూపులు చూడసాగింది. దీంతో అనుమానం వచ్చిన రిక్షావాలా ఆ బాలికను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి వారికి అప్పగించాడు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా తనది కుర్జా గ్రామమని సమాధానమిచ్చింది. దీంతో కుర్జా పదానికి దగ్గరగా అనిపించే పలు ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

అలాగే పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో ఆ బాలిక ఓ విస్తుపోయే విషయాన్ని తెలిపింది. తన అంకుల్‌ పింటుతో కలిసి కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి ట్రైన్‌లో వచ్చానని చెప్పింది. తనను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పేస్తుంటే ఏడవడంతో పింటు తనను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. అనుమానం వచ్చిన పోలీసులు తనని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి వేధింపులు జరగలేదని నిర్ధారణ అయింది. రోజులు గడుస్తున్నా బాలికకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకకపోవటంతో పోలీసులకు దర్యాప్తు కష్టతరమైంది. బులంద్‌షహర్‌ జిల్లాలో కుర్జా గ్రామం ఉందని తెలుసుకున్న పోలీసులు జూలై 31న బాలికను వెంటపెట్టుకుని ఆ ఊరికి వెళ్లారు. బాలికను  ఆ గ్రామ పరిసర ప్రాంతాల పేర్లు చెప్పమని అడగ్గా ఆమె తల్లి నివసించే సోన్‌బార్సా గ్రామం పేరు చెప్పింది. గూగుల్‌ మ్యాప్స్‌ సహాయం తీసుకున్న పోలీసులకు సోన్‌బార్సా గ్రామం నిజంగానే ఉన్నట్టు గుర్తించారు. దీంతో సులువుగా వారి కుటుంబ సభ్యులను కనిపెట్టారు. అక్కడ బాలికను తన తండ్రి చేతికి అప్పగించారు.

బాలిక తండ్రి జీతన్‌ మాట్లాడుతూ.. ‘నా కూతురికి చికిత్స చేయడానికి ఆగస్టు 1న కుర్జా గ్రామం నుంచి ఢిల్లీకి వచ్చాం. ఇందుకోసం కీర్తినగర్‌లోని జేజే కాలనీలో సోదరి ఇంటి వద్ద ఉన్నాం. అక్కడ నా కూతురు తప్పిపోయింది’ అని పేర్కొన్నారు. సంవత్సరం క్రితం కూడా తను ఇలాగే తప్పిపోయినా పంజాబ్‌లోని లుథియానాలో మళ్లీ దొరికిందని తెలిపారు. అందుకే తమ కూతరు కనిపించకపోతే పోలీసులు తనను ఎలాగైనా తీసుకువస్తారనే ధీమాతో ఉన్నానన్నారు. అయితే బాలిక చెప్పినట్టుగా పింటు అనే పేరుతో ఎవరూ లేరని జీతన్‌ స్పష్టం చేయడంతో పోలీసులు లైంగిక వేధింపుల కేసును కొట్టివేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు