గోడలపై పిచ్చిరాతలు.. 30 మంది బాలికలపై దాడి

7 Oct, 2018 11:55 IST|Sakshi

30 మంది బాలికలను చావబాదిన ఆకతాయిలు

పట్నా : ప్రభుత్వ బాలికల వసతి గృహంపై మూకుమ్మడి దాడి జరిగింది. 20 మందికి పైగా యువకులు కర్రలతో బాలికల హాస్టల్‌పై దాడిచేశారు. 30 బాలికలను తీవ్రంగా గాయపరిచి వారిపై లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన బిహార్‌లోని సుపౌల్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. సమీప గ్రామంలోని కొందరు యువకులు హాస్టల్‌ గోడలపై అశ్లీల రాతలు రాస్తున్నారు. విద్యార్థినిలు విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. హాస్టల్‌ గోడలపై అభ్యంతరకర రాతలు రాస్తున్న ఓ యువకుడికి బాలికలు శనివారం దేహశుద్ధి చేశారు. బాలికల దాడికి ప్రతీకారంగా ఆ గ్రామంలోని 20 మందికి పైగా యువకులు హాస్టల్‌పై దాడికి దిగారు. ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటున్న సమయంలో 30 మంది బాలికలను కర్రలతో చావబాదారు. వారిపై లైంగిక దాడికి యత్నించారు.

దాదాపు గంటపాటు పిల్లలను చిత్రవధ చేశారని హాస్టల్‌ వార్డెన్‌ రయీమా రాజ్‌ తెలిపారు. స్కూల్లోని వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఘటన గురించి తెలుసుకున్న స్థానిక నాయకులు గాయపడిన బాలికలను ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కాగా, బిహార్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నితీష్‌కుమార్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నెలల క్రితం ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో 34 మంది బాలికలు లైంగిక దాడికి గురైన ఘటన.. విద్య పేరుతో గయలో 15 మంది బాలురపై లైంగిక దాడికి యత్నించిన బౌద్ధ గురువు ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు