కరోనా భయం: వరుస ఆత్మహత్యలు

2 Apr, 2020 17:38 IST|Sakshi

లక్నో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భయంతో దేశంలో బలవన్మరణాలకు పాల్పుడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్‌ భయంతో ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సహరన్‌పూర్‌లోని ప్రభుత్వ ఉద్యోగి ఒకరు కార్యాలయంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనావైరస్‌ సోకుతుందన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు అతడు సూసైడ్‌ నోట్‌లో రాసినట్టు సీనియర్‌ ఎస్పీ పి. దినేశ్‌కుమార్‌ వెల్లడించారు. చాలా కాలంగా అతడు కుంగుబాటు సమస్యతో బాధ పడుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. 

కోవిడ్‌ సోకిన వ్యక్తి ఒకరు షామిలి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక ఆస్పత్రి  క్వారంటైన్‌ వార్డులో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు జిల్లా మేజిస్ట్రేట్ జస్‌జీత్‌ కౌర్‌ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. (కరోనా: 93 వేల మంది ప్రాణాలకు ముప్పు)

క్వారంటైన్‌ నుంచి తప్పించుకున్న 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లఖిమ్‌పూర్‌లో జరిగింది. గురుగ్రామ్‌ నుంచి మార్చి 28న తిరిగొచ్చిన యువకుడిని క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడి నుంచి రెండుసార్లు తప్పించుకుని కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రయత్నించాడు. రెండు పర్యాయాలు పోలీసులు అతడిని నిలువరించారు. మరోసారి తప్పించుకుని తన గ్రామానికి వెళ్లాడు. అయితే తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

జ్వరం, జలుబుతో బాధ పడుతున్న రైతు ఒకరు మంగళవారం మధురకు సమీపంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గ్రామం కరోనా బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చి 24న కాన్పూర్‌లో మరో యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. హాపూర్‌, బరేలీ ప్రాంతాల్లో మరో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. (కరోనా నుంచి తనను తాను కాపాడుకోలేడు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు