మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

1 Aug, 2019 08:25 IST|Sakshi
ప్రభుత్వ ఆస్పత్రిలో విచారణ జరుపుతున్న  ఎస్సై దుర్గాప్రసాద్‌ 

సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : అసలే ఆమె మూగ.. ఆ పైన ఆరోగ్యం బాగో లేకపోవడంతో  స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. అక్కడ వైద్యం తీసుకుంటున్న తరుణంలో ఆస్పత్రి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిన శానిటరీ సూపర్‌వైజర్‌ కన్ను వార్డులో ఒంటరిగా ఉన్న ఆమెపై పడింది. దీంతో మూగ మహిళపై అసభ్యకర ప్రవర్తనకు దిగాడు. ఇంతలో పక్క వార్డులో ఉన్న మరో మహిళ వచ్చి గోల చేయడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శానిటరీ సూపర్‌వైజర్‌పై చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై 364, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐ సీహెచ్‌ రాజులునాయుడు , ఎస్సై ఐ.దుర్గాప్రసాద్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. డలంలోని పేరిపి గ్రామానికి చెందిన ఓ మూగ మహిళా రోగి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఈ నెల 30న చీపురుపల్లి సీహెచ్‌సీలో చేరారు.

దీంతో సిబ్బంది ఆమెకు వైద్యం అందిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి పై అంతస్తు వార్డులో ఉన్న మహిళా మూగ రోగి తల్లి మందులు తెచ్చుకునేందుకు ఫార్మసీకు వెళ్లింది. ఆ సమయంలో ఆ వార్డులోకి ప్రవేశించిన శానిటరీ సూపర్‌వైజర్‌ రామచంద్రరరావు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తనకు దిగాడు. దీంతో పక్కవార్డులో ఉన్న పోలమ్మ అనే మహిళ వచ్చి గోల చేసేసరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న మూగ మహిళా రోగి తల్లి ఉప్పాడ ఎల్లమ్మకు మిగిలిన రోగులు వివరించారు. దీంతో బుధవారం ఉదయం ఎల్లమ్మ తన కుమార్తెకు జరిగిన అన్యాయం వివరిస్తూ శానిటరీ సూపర్‌వైజర్‌ రామచంద్రరావుపై చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితురాలు నుంచి పలు వివరాలు రాబట్టి, మిగిలిన రోగులతో విచారణ జరిపిన అనంతరం 364, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు