ప్రతీకారానికి సిద్ధం.. కనిపిస్తే కాల్చివేయండి..!

15 Dec, 2017 09:34 IST|Sakshi

దుండగులను కాల్చివేయండి

రాజస్తాన్‌ పోలీసుల ఉత్తర్వులు

అదుపులో నాధూరాం భార్య, ప్రియురాలు

సీఐ పెరియపాండియన్‌భౌతికకాయం రాక

సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో తుపాకీ కాల్పులకు గురై విషాదకరమైన రీతిలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పెరియ పాండియన్‌ ప్రాణాలు కోల్పోవడంపై తమిళనాడు పోలీసుశాఖ అగ్రహంతో రగలిపోతోంది. పోలీసు అధికారి ప్రాణాలు హరించిన దుండగులు నాధూరాం, దినేష్‌ చౌదరి కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం సూచన మేరకు రాజస్తాన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం చెన్నైకి చేరుకున్న సీఐ పెరియపాండియన్‌ భౌతికకాయానికి సీఎం ఎడపాడి సహా పలువురు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. 

చెన్నై శివారు కొళత్తూరు రెట్టేరి సమీపంలోని లక్ష్మీపురం కడప రోడ్డులోని మహాలక్ష్మి జ్యువెలరీ, కుదువ వ్యాపారంలో గత నెల 16వ తేదీ మధ్యాహ్నం దొంగలు పడి 3.5 కిలోల బంగారు నగలు, 4.5 కిలోల వెండి, రూ.2లక్షల నగదు దోచుకున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ దోపిడీపై రాజమంగళం పోలీసులు కేసునమోదు చేసి రాజస్థాన్‌కు చెందిన పాత నేరస్తులు నాధూరాం, దినేష్‌ చౌదరి ముఠాగా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు రాజస్తాన్‌ వెళ్లిన పోలీసు బృందంలోని మధురవాయల్‌ శాంతిభద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్‌ పెరియపాండి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. 

చెన్నై కొళత్తరు ఇన్‌స్పెక్టర్‌ మునిశేఖర్, పలువురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో దుండగులు భీకరమైన రీతిలో పోలీసులపై ఎదురు తిరగడం, కాల్పులు జరిపి పారిపోవడం తమిళనాడు పోలీసుశాఖను గగుర్పాటుకు గురిచేసింది. నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని తమిళనాడు నుంచి మరో పోలీసు బృందం రాజస్తాన్‌కు చేరుకుంది. అయితే సీఐ పెరియ పాండియన్‌పై కాల్పులు జరిపి పారిపోయిన దుండగుల చేతుల్లో తుపాకులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 

కనిపిస్తే కాల్చివేయండి: వారిని ప్రాణాలతో పట్టుకునే క్రమంలో మరోసారి దారుణాలు చోటుచేసుకుంటాయని పోలీసుశాఖ అనుమానిస్తోంది. ఈ కారణంగా నాధూరం, దినేష్‌చౌదరి కనిపిస్తే వెంటనే కాల్పులు జరిపేలా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుని రాజస్తాన్‌ ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. రాజస్తాన్‌ ప్రభుత్వం సైతం కాల్పులకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది. నాధూరం ఆచూకీ కోసం ఆయన భార్య మంజు, ప్రియురాలు దివ్యలను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా దినేష్‌ చౌదరిని గురువారం రాజస్తాన్‌లో  అరెస్టుచేసినట్టు సమాచారం.

సీఐకి ఘన నివాళి: ఇన్‌స్పెక్టర్‌ పెరియపాండియన్‌ భౌతిక కాయాన్ని గురువారం రాజస్తాన్‌ నుంచి విమానంలో  చెన్నైకి తీసుకువచ్చారు. చెన్నై విమానాశ్రయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆయన భౌతకాయాన్ని ఉంచారు. ముఖ్యమంత్రి పళనిస్వామి,  ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఐకి ఘన నివాళులర్పించారు. ఎడపాడి, పన్నీర్, మంత్రులు, పోలీసుశాఖలోని మొత్తం అధికారులు, సిబ్బంది తమ ఎడమచేతికి నల్లని గుడ్డను కట్టుకుని సంతాపం ప్రకటించారు. సీఐ భౌతికకాయాన్ని గురువారం సాయంత్రం చెన్నై నుంచి విమానంలో ఆయన స్వస్థలమైన తిరునెల్వేలి జిల్లా శంకరన్‌ కోవిల్‌కు  తీసుకెళ్లారు. ప్రభుత్వ లాంఛనాలతో రాత్రి ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. 

మరిన్ని వార్తలు