ప్రభుత్వ క్యాంటిన్‌ ‘వ్యాపార’మంత్రం..

9 Mar, 2019 09:25 IST|Sakshi
ఆస్పత్రి బయట వైపు ఏర్పాటు చేసిన షట్టర్లు

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో క్యాంటీన్‌ సేవలు విచిత్రంగా ఉన్నాయి. ఆస్పత్రిలోని రోగులు, బంధువుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. ఆస్పత్రి వైపు చిన్నదారి ఏర్పాటు చేసిన నిర్వాహకుడు.. బయట వైపు రెండు షట్టర్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఏళ్లుగా ఒకరికే టెండర్‌ దక్కు తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రిలో చేరుతున్న రోగులు, వారి బంధు వులు ఛాయ్, టిఫిన్‌ కోసం బయట హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. 

ఏళ్ల తరబడి ఒకరికే..!
దాదాపు పదేళ్ల క్రితమే క్యాంటీన్‌ నిర్వహణకు టెండర్‌ వేశారు. అప్పటి నుంచి ఒక్కరే క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికొచ్చే రోగులు, బంధువులకే క్యాంటీన్‌ సేవలందించాలి. కానీ లోపలి వైపు చిన్నదారం మాత్రమే ఏర్పాటు చేసి బయటి వైపు షట్టర్లు వేసి బేకరీ నిర్వహిస్తూ వ్యాపారం చేపడుతున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంగా అవతరించిన అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు వస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకంతో మరింతగా పెరిగిపోయింది.

రోగులకు ఆస్పత్రిలో సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నప్పటికీ టీలు, టిఫిన్లు మాత్రం కరువయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించిన క్యాంటీన్‌లో అన్ని రకాల టీలు, టిఫిన్లు ఉండాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కానీ క్యాంటీన్‌లో మాత్రం టీలు, టిఫిన్లు దొరకడం లేదు. రాత్రి వేళల్లో బంధువులకు భోజనం దొరకడం లేదు. ఈ క్యాంటీన్‌లో బేకరి నిర్వహించడంతో విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా ఒకరికే కాంట్రాక్ట్‌ కొనసాగిస్తున్నారని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం టెండర్‌ నిర్వహిస్తే నడిబొడ్డు కావడంతో అందులో జిల్లా ఆస్పత్రిగా పేరు పొందడంతో మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. కానీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.   

చర్యలు తీసుకుంటాం  
ఆస్పత్రిలో ఒకసారే టెండర్‌ నిర్వహిస్తాం. ప్రస్తుతం అతనే నిర్వహిస్తున్నాడు. టీ, టిఫిన్లు ఏర్పాటు చేయాల్సిందే. సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.   
– సదామోహన్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌   

మరిన్ని వార్తలు