నిధుల దుర్వినియోగం కేసు; బ్యాంకు మేనేజర్‌ అరెస్ట్‌ 

11 Feb, 2020 10:36 IST|Sakshi
రామ సూర్య కిరణ్‌కుమార్‌ (ఫైల్‌)

14 రోజుల రిమాండ్‌

సాక్షి, అత్తిలి( పశ్చిమగోదావరి) : బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిన కేసులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ పోతాప్రగడ రామ సూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తణుకు సీఐ డి.ఎస్‌.చైతన్యకృష్ణ  సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్‌ 2015–16 మధ్యకాలంలో బ్యాంకును మోసం చేసి రూ.37 లక్షలను స్వాహా చేశాడు. రైతుల ఆధార్‌కార్డులతో 11 జాయింట్‌ లయబిలిటి గ్రూపులను ఏర్పాటు చేసి, ఒక్కొక్క గ్రూపునకు రూ. 3 లక్షలు చొప్పున రూ.33 లక్షలతో పాటు మరో 8 మంది రైతుల పేరున రూ.4 లక్షలు పంట రుణాలుగా  మంజూరు చేశాడు.

రైతుల సంతకాలు, వ్యవసాయశాఖ మండల అధికారి సంతకాలను బ్యాంకు మేనేజర్‌ పోర్జరీ చేశాడు. తప్పుడు రికార్డులు సృష్టించి మొత్తం రూ.37 లక్షల బ్యాంకు నిధులను స్వప్రయోజనాల కోసం కిరణ్‌కుమార్‌ వాడుకున్నాడు. రైతులు పేరున తీసుకున్న రుణాలు తిరిగిచెల్లించకపోవడంతో తరువాత కాలంలో వచ్చిన మేనేజర్‌ రైతులకు నోటీసులు జారీ చేయడంతో నిధులు దుర్వినియోగం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ బ్యాంకు నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు వచ్చి 2019 సెప్టెంబర్‌ 14న అప్పటి మేనేజర్‌ జి.శ్రీనివాస్‌ అత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పోతాప్రగడ వెంకట రామసూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి తణుకు కోర్టుకు హాజరు పర్చగా, 2వ అదనపు జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎన్‌.మేరి నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు