డబ్బు,నగల కోసం మనవడి దాష్టీకం

30 Nov, 2017 08:44 IST|Sakshi

అవ్వ, తాతలను అంతమొందించి మృతదేహాలను తగులబెట్టే యత్నం

పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుల దాడి

కాల్పులు జరిపిన సీఐ

ప్రధాన నిందితుడితోసహా ముగ్గురి అరెస్ట్‌

వైట్‌ఫీల్డ్‌: నగల కోసం తాతా, అవ్వలను అంతమొందించి మృతదేహాలను గ్యాస్‌తో దహనం చేసేందుకు యత్నించిన మనవడి ఉదంతం మహదేవపుర నియోజకవర్గం అశ్వర్థనగర్‌లోలో చోటు చేసుకుంది.  వైట్‌ఫీల్డ్‌ డెప్యూటీ పోలీసు కమిషనర్‌ అబ్దుల్‌ అహ్మద్‌ తెలిపినమేరకు వివరాలు..ఇక్కడి కళామందిర్‌ వెనుక బీఈఎల్‌లో ఉద్యోగ విరమణ పొందిన గోవిందన్‌(62) తన భార్య సరోజ(61)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి వద్ద నగలు ఉన్నాయని పసిగట్టిన  వారి మనవడు ప్రమోద్‌ వాటిని కాజేసేందుకు పథకం రచించాడు. స్నేహితుడు ప్రవీన్‌ను, హుసేన్‌పాషాలను సంప్రదించాడు.   ముగ్గురూ కలిసి ఈ నెల 26న ఇంట్లోకి చొరబడి గోవిందన్, సరోజ దంపతులను హత్య చేసి నగలు, నగదు దోచుకున్నారు. అనంతరం గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ చేసి మృతదేహాలను దహనం చేసేందుకు యత్నించి విఫలమై ఉడాయించారు. గ్యాస్‌ వాసన పసిగట్టిన స్థానికులు వెళ్లి పరిశీలించగా హత్యోదంతం వెలుగు చూసింది. 

నగర కమిషనర్‌   కుమార్,  తూర్పు విభాగం అదనపు కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌ సింగ్, సంయుక్త కమిషనర్‌ సతీష్‌ కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.   నిందితులు యమలూరులో ఉన్నట్లు తెలుసుకున్న వైట్‌ఫీల్డ్‌ క్రైం విభాగం సీఐ ప్రషీలా, హెచ్‌ఏఎల్‌  సీఐ మహబూబ్, మహదేవపుర సీఐ శ్రీనివాసలు సిబ్బందితో కలిసి వెళ్లారు.   అక్కడ తలదాచుకున్న   హుసేన్‌పాషా పోలీసులపై మారణాయుధాలతో దాడికి దిగగా కానిస్టేబుల్‌ రవి గాయపడ్డాడు. దీంతో ప్రషీలా ఆత్మరక్షణ కోసం రివాల్వర్‌తో కాల్పులు జరిపారు.  బుల్లెట్‌  హుసేన్‌పాషా  ఎడమ కాలిలోకి దూసుకెళ్లింది. అనంతరం  హుసేన్‌ పాషాను, కానిస్టేబుల్‌ రవిని ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు నిందితులైన ప్రమోద్, ప్రవీణ్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితులు గతంలో బైక్‌  చోరీలకు  పాల్పడేవారని పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు