ఆడబిడ్డగా పుట్టడమే శాపమా!

23 Oct, 2019 07:14 IST|Sakshi

నర్సు రూపంలో వెలుగులోకి....కృష్ణగిరిలో కిరాతకం

సాక్షి, చెన్నై : ఆడ బిడ్డగా పుట్టడమే ఆ శిశువుకు శాపంగా మారింది. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన నానమ్మే తనను హతమారుస్తుందని కూడా తెలియని ఆ శిశువు మరణం మిస్టరీ ఓ నర్సు రూపంలో వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరిలో ఈఘతకం చోటు చేసుకుని ఉన్నది. కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో ఆడ శిశువు మరణాలు ఒకప్పుడు మరీ ఎక్కువే. ఆడ బిడ్డ పుట్టిందంటే క్షణాల్లో  హతమార్చిన కషాయి కుటుంబాలు ఎన్నో. ఇక్కడి ఇతి వృత్తాంతో సినిమాలు సైతం తెరకెక్కి ఉన్నాయి. దీంతో ఆడ శిశు మరణాల కట్టడి చేయడానికి పాలకులు తీవ్రంగానే కొరడా ఝుళిపించారు. ప్రస్తుతం  ఈ మరణాలు అదుపులోనే ఉన్నా,  చాప కింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా శిశు హత్యలు సాగుతూనే  ఉన్నాయి.  ఈ పరిస్థితుల్లో ఓ కసాయి నాన్నమ్మే ఓ ఆడ శిశువును హతమార్చడం వెలుగులోకి వచ్చింది.

రెండో బిడ్డ కూడా...
కృష్నగిరి జిల్లా పోచ్చం పల్లి సమీపంలో పారూర్‌ నాగర్‌ కొట్టు గ్రామానికి చెందిన రాజా కూలి కార్మికుడు. రాజకు సత్యతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఆరాద్య(3) కుమార్తె ఉంది. తన కుమారుడికి మగ బిడ్డ పుట్టాలని రాజ తల్లి పొట్టియమ్మాల్‌ మొక్కని దేవుళ్లు అంటూ లేదు. చివరకు రెండో సారిగా కోడలు గర్భం దాల్చడంతో , ఈ సారి పుట్టబోయేది మగ బిడ్డే అన్న «ధీమాతో పొట్టియమ్మాల్‌ ఉంటూ వచ్చింది. అయితే, గత నెల మరో పండంటి ఆడ బిడ్డకు సత్య జన్మనిచ్చింది. అప్పటి నుంచే పొట్టియమ్మాల్‌ రుస రుసలాడుతూ తన కోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇరుగు పొరుగు వారు నచ్చ చెప్పడంతో ఆ బిడ్డను, కోడల్ని ఇంటికి తీసుకొచ్చింది. ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పొట్టియామ్మల్‌ చూసుకుంది. అయితే, ఇదంతా నటనే అన్నది  రాజ, సత్యలకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో   గత వారం రాజ, సత్యలు సామాన్లు కొనుకున్నేందుకు బయటకు వెళ్లారు. వచ్చి చూడగా, పొట్టియమ్మాల్‌ బోరున విలపిస్తూ బిడ్డ ఊపిరి ఆడక తల్లడిల్లిందని, తాను చేయాల్సిందంతా చేశానని, ఉలుకు పలుకు లేదని కన్నీటి పర్యంతంతో నాటకాన్ని రక్తికట్టించింది. బిడ్డ మరణించడంతో ఓ బాక్స్‌లో పెట్టి  ఇంటికి సమీపంలో ఖననం చేశారు. ఇంత వరకు అన్నీ బాగానే ఉన్నా, సోమవారం  ఆ ఇంటికి వచ్చిన గ్రామ నర్సు రూపంలో అసలు గుట్టు బయటకు వచ్చింది.

కసాయి నాన్నమ్మ అరెస్టు...
బిడ్డకు టీకా వేయడం కోసం నర్సు మంగై ఆ ఇంటికి వచ్చింది. విషాదంతో ఉన్న సత్యను చూసి ఎక్కడ బిడ్డ అని ప్రశ్నించింది. జరిగిన విషయాన్ని ఆమెతో పంచుకుని సత్య విలపించింది. అన్ని విన్న  మంగైను అనుమానం వీడ లేదు. బిడ్డ ఆరోగ్య వంతంగా ఉందని, తానే అన్ని రకాల పరీక్షలు నిర్వహించానని, ఎలా ఊపిరి ఆడ కుండా మరణిస్తుందని సత్య దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ సమాచారాన్ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి ఆ నర్సు తీసుకెళ్లింది. పోలీసు సహకారంతో ఆరోగ్య అధికారులు రంగంలోకి దిగడంతో పొట్టియమ్మాల్‌ రంగు బయట పడింది. తన కుమారుడికి మగ బిడ్డ పుట్టాలని తాను వేడుకోని దేవుళ్లు లేదని, అయితే, తొలి బిడ్డ ఆడ బిడ్డగా పుట్టడంతో సర్దుకున్నట్టు ఆమె పోలీసు దృష్టికి తెచ్చింది. ఈ సారైనా మగ బిడ్డ పుడుతాడుకుంటే, మళ్లీ ఆడ బిడ్డే పుట్టిందని, అందుకే తనకు ఇష్టం లేకున్నా, ఇంటికి రప్పించానని, తన కుమారుడు, కోడలుకు కూడా తెలియకుండా పాలలో మందు కలిపి ఇచ్చి హతమార్చి, ఊపిరి ఆడకుండా మరణించినట్టు నాటకం ఆడినట్టు వాంగ్ములం ఇచ్చింది.  ఈ నర్సు  మంగై రూపంలో తన బండారం బయటకు వచ్చిందని పేర్కొంటూ, ఆమె  మీద తన కోపాన్ని ప్రదర్శించింది. దీంతో పొట్టియమ్మాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆ శిశువు మృత దేహాన్ని మంగళవారం బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తలు