తాత లేడని.. జీవితం వ్యర్థమని!

6 Feb, 2019 11:46 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న బాలకృష్ణ

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మనవడు

అభంశుభం తెలియని వయసులో అమ్మ దూరమైంది..  ఆడుకోవాల్సిన సమయంలో ఆలనాపాలనా కరువైంది.  ఆడుతూ పాడుతూ గెంతాల్సిన పసి మనసు తల్లడిల్లింది.  తల్లి ప్రేమలేదని బాల్యమంతా తపన పడింది.అమ్మలేని బాల్యాన్ని తాత ప్రేమ చేరదీసింది..ఆ లోటు లేకుండా ఆప్యాయత సొంతమైంది..ఇంతలో విషాదం..అమ్మా నాన్న తానై పెంచిన మమకారం దూరమైందికంటికి రెప్పలా పెంచిన తాతలేని లోకం
చీకటి అనిపించింది..తనలో తానే కుమిలిపోయిమనవడూ తనువు చాలించాడు.

వజ్రకరూరు/ అనంతపురం అర్బన్‌: పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన హనుమంతు కుమారుడు బాలకృష్ణ (17) అనంతపురంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్న వయసులోనే తల్లి కృష్ణవేణి చనిపోవడంతో బాలకృష్ణను తాత అంగడి రామాంజనేయులు గారాభంగా పెంచాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట తాత చనిపోవడంతో బాలకృష్ణ ఇంటికి వచ్చాడు. తాత మృతిని జీర్ణించుకోలేకపోయాడు. తనలో తానే కుమిలిపోయాడు. మూడు రోజుల ‘దినాలు’ పూర్తి అయ్యాక కళాశాలకు వెళ్లాలనుకున్నాడు. మంగళవారం ఉదయం అనంతపురం వెళ్లాడు. అలా వెళ్లిన గంటల వ్యవధిలోనే రామ్‌నగర్‌ రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తండ్రి , బంధువులు హుటాహుటిన అనంతపురం వెళ్లి బాలకృష్ణ మృతదేహాన్ని సొంతూరుకు తీసుకొచ్చారు. గ్రామంలో విషాదం అలుముకుంది.

మరిన్ని వార్తలు