మంటగలుస్తున్న మానవత్వం

8 Feb, 2018 15:45 IST|Sakshi
‍ప్రతీకాత్మక చిత్రం

గ్రేటర్‌లో వరుస హత్యలు, ఆత్మహత్యలు 

మాయమవుతున్న మానవ సంబంధాలు

సమిధలవుతున్న మహిళలు, చిన్నారులు

క్షణికావేశంలో దారుణాలు

ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, మానసిక క్షోభ మరెన్నో కారణాలు

పనిచేయడం లేదని భర్తను ప్రశ్నించిన భార్యతో సహా ఇద్దరు పిల్లలను హత్య చేసిన హరీందర్‌...  
సహజీవనం చేస్తున్న అమ్మాయి తన భార్యకు ఫోన్‌ చేసి వేధిస్తోందని ఆమెను, ఆమె కూతురు, తల్లిని అమానుషంగా చంపేసిన మధు...  
అనుమానంతో వివాహం చేసుకోబోయే అమ్మాయిని బండరాయితో మోది హతమార్చిన మోతీలాల్‌...  
చదువు ఒత్తిడిలో పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి...  
తల్లి సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మరో విద్యార్థి...  

గ్రేటర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటనలు సిటీజనులను కలచి వేస్తున్నాయి. నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, ఒత్తిడి, మానసిక క్షోభ, మూఢనమ్మకాలు... ఇలా కారణాలేవైనా ఇటీవల చోటుచేసుకున్న ఈ హత్యలు, ఆత్మహత్యలు మంటగలసిపోతున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో : క్షణికావేశంలో మృగమవుతున్న మనిషి... బంధాలను మరిచి యముడవుతున్నాడు. ‘నా అన్న వాళ్లనే..’ నరికి చంపేస్తున్నాడు. ఓచోట భార్యాపిల్లలను, మరోచోట నిండు గర్భిణిని, ఇంకోచోట అమ్మాయిని, మూఢనమ్మకాలతో పసికందును... హతమార్చిన ఘటనలు భాగ్యనగరంలో కలకలం సృష్టిస్తున్నాయి. స్వార్థంతో, క్షణికావేశంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు.. వందల ఏళ్ల నాటి మానవీయ విలువల నిర్మాణాన్ని కూల్చేస్తున్నాయి. గత 10రోజుల్లో ఈ ఘటనల్లో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు హతమయ్యారు.  

ఎందుకిలా..?  
మనుషులు, విలువలు ఉనికి కోల్పోతున్నాయి. ప్రేమానుబంధాలు, మమతానురాగాలు శిథిలమవుతున్నాయి. కలహాలే కలిసి జీవిస్తున్నాయి. మనస్పర్థలు, ఘర్షణలే గాలివానలవుతున్నాయి. ‘నేను మాత్రమే’ బాగుండాలనే స్వార్థపూరితమైన దృక్పథం, తన సుఖ సంతోషాలకు ఎవరడ్డొచ్చినా భరించలేని అసహనం, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంస్కృతి, ఆశలు, ఆశయాలను, అహాలను సంతృప్తి పర్చలేని దాంపత్య జీవితం... మొదలు నరికిన చెట్టులా కూలిపోతోంది.

ఇలాంటి సంఘటనల్లో ఒకప్పుడు ఒకరి నుంచి ఒకరు విడిపోవాలని కోరుకునేవారు. ఇప్పుడలా కాదు. తనకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించుకోవడమే లక్ష్యంగా  హత్యలకు పాల్పడుతున్నారు. మగవాళ్లలో బలంగా ఉండే ఈ లక్షణం అక్కడక్కడా మహిళల్లోనూ కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల్లో  మనుషులు ఎంతటి తెగింపునకైనా పాల్పడుతున్నారు. ఇలాంటి ఉదంతాల్లో పిల్లలు సైతం వాళ్ల క్రూరత్వానికి బలవుతున్నారు. 

అసహనం.. అనుమానం.. క్షణికావేశం  
అపర్ణ అనే మహిళను రెండో వివాహం చేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న మధు... ఆ వ్యవహారం  బయటకుపొక్కి గొడవలకు దారితీయడంతో గత నెల 30న అపర్ణను, ఆమె తల్లి విజయమ్మను, కూతురు కార్తికేయను హతమార్చి తలుపులు వేసి తాపీగా వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల నేపథ్యంలో హరీందర్‌ జిల్లెలగూడలో భార్యాపిల్లలను హతమార్చాడు. వారం కింద హయత్‌నగర్‌లో మోతీలాల్‌ అనే వ్యక్తి తనకు కాబోయే  భార్యపై అనుమానంతో ఆమెను చంపేశాడు.

ఈ సంఘటనల అన్నింటిలోనూ విపరీతమైన అసహనం, తనకు అడ్డుగా ఉన్నారని భావిస్తే కట్టుకున్న భార్య, పిల్లలను సైతం తొలగించుకొనే మానసిక ఉన్మాద ప్రవృత్తి కారణమని మనస్తత్వ, సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉన్మాద ప్రవృత్తితో అనుబంధాలు, సామాజిక విలువలు హతమవుతున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడం, వ్యక్తులపై ఎలాంటి సామాజిక నియంత్రణ కూడా లేకపోవడం.. ఈ రకమైన నేరాలకు ఆజ్యం పోస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
తరచూ విసిగిస్తే...  
భాగస్వామిని తరచూ విసిగిస్తూ మాట్లాడుతుంటే ఆ స్థితిని మానసిక పరిభాషలో ‘డెల్యూషన్‌’ అంటారు. ఇలాంటి ప్రవర్తన కలవారే హత్యలకు పాల్పడుతుంటారు. భార్య ప్రవర్తన ఎంత బాగున్నా.. ఏదో ఒక  విషయంలో వేధింపులకు గురిచేస్తుంటారు. ఇవే చివరకు హత్యలకు దారితీస్తాయని మానసిక వైద్యనిపుణులు  విశ్లేషిస్తున్నారు. సినిమాలు, సీరియళ్లలో చూపే వివాహేతర సంబంధాలు తమ ఇంట్లోనూ జరుగుతున్నాయని అపోహ పడడం, మద్యానికి బానిసవడం... ఆ దృక్పథంలో నేరాలకు పాల్పడడం జరుగుతోందని పేర్కొంటున్నారు. నిందితులు విచారణలో కొంచమైనా పశ్చాత్తాపం లేకుండా తాము చేసిన నేరాలను విపులంగా వివరించడం గమనార్హం.  

సామాజిక నియంత్రణ అవసరం  
ఈ అమానవీయమైన సంక్షోభాన్ని తొలగించి, ఉన్నత విలువలను స్థాపించేందుకు ఒక సామాజిక నియంత్రణ వ్యవస్థ అవసరం. మెగా సిటీలు, మహానగరాలు ఉనికిలోకి వచ్చిన తరువాత ఈ సామాజిక నియంత్రణ లేకుండా పోయింది. సోషల్‌ మీడియా అందుకు మరింత ఆజ్యం పోస్తోంది. మనిషి ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం, విలువల స్థాపనతో మాత్రమే ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇలాంటి దారుణాలు తగ్గుముఖం పడుతాయి.  
– ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ 

సమష్టి జీవన విధానం అలవడాలి   
మనుషుల కంటే వస్తువులు, సుఖం, వ్యక్తిగత ఆనందాలే ముఖ్యమయ్యాయి. నూతన ఆర్థిక విధానాలు, వస్తు వినిమయవాద సంస్కృతి ఇందుకు కారణం. దీంతో సహజమైన మనిషి లక్షణాలు చనిపోయి, మృగాల్లా మారుతున్నారు. మరోవైపు డబ్బుకున్న గుర్తింపు మనుషులకు లేకపోవడంతో ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విపరీత ధోరణులు తొలగిపోవాలంటే సమాజంలో సమష్టి జీవన విధానం అలవడాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ విలువలతోనే అది సాధ్యం.     
– ప్రొఫెసర్‌ హరగోపాల్‌ 

వాస్తవాన్ని గుర్తించలేని అజ్ఞానం  
శక్తికి మించిన భారీ అంచనాలు, ఆర్థికంగా బాగా సంపాదించాలనే కోరికల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేని అజ్ఞానం ఇది. ఈ ఒత్తిడి నుంచి  బయటపడేందుకు సిగరెట్, ఆల్కహాల్, వివాహేతర సంబంధాల లాంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. మనస్తత్వ పరిభాషలో దీనిని ‘కోపింగ్‌ మెకానిజం’ అంటారు. ఒక దుస్థితి నుంచి బయటపడేందుకు మరో దుస్థితిని ఎంపిక చేసుకోవడం. ఈ క్రమంలో జరిగే కలహాల కారణంగా అహం దెబ్బతిని దారుణాలకు  పాల్పడుతున్నారు. ఇది సైకోపథాలజీ మనస్తత్వం. కుటుంబ సంబంధాలు బలోపేతం కావాలంటే పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌ అవసరం.  
– డాక్టర్‌ సి.వీరేందర్, మనస్తత్వ నిపుణులు  

ఒత్తిడి.. ఒంటరితనం  
ఒత్తిడి, ఒంటరితనమే ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో డిప్రెషన్‌ బాధితులే అధికంగా ఉంటున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమవడం, సమస్యలను ఎదుర్కోలేకపోవడం, పిల్లలను అతి గారాభం చేయడం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డిప్రెషన్‌ బాధితులు, సున్నిత మనస్కులు, హార్మోన్ల అసమతుల్యంతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.   
–  డాక్టర్‌ అనితా రాయిరాల, సైక్రియాట్రిస్ట్, రిమ్స్‌ 

జీవితం విలువ తెలియాలి  
ఇలాంటి దారుణాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరికీ జీవితం విలువ తెలియాలి. ఆ విలువలను నేర్పే విధంగా విద్యావిధానంలో, సామాజికంగా మార్పు రావాలి. నైతిక విలువలను చిన్నప్పటి నుంచి అలవర్చాలి. తల్లిదండ్రుల పెంపకంలో, మీడియాలోనూ మార్పులు అవసరం. నేరాలను నియంత్రించే విధంగా మీడియా  బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించాలి.  
– లలితాదాస్, సైకాలజిస్ట్‌  

మరిన్ని వార్తలు